ఫ్లాష్ న్యూస్... జవాన్ శవపేటికతో కేంద్ర మంత్రి సెల్ఫీ

పుల్వామా ఉగ్రదాడిలో 40మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే..! జవాన్ల మృతిపై యావత్ దేశం కన్నీళ్లు పెట్టుకుంది. పాకిస్తాన్ తీరుపై ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. అవంతిపోరా ప్రాంతంలో జవాన్‌ల కాన్వాయ్‌ని జైషే మహ్మద్ ఉగ్రవాది బాంబులు నింపిన కారుతో ఢీకొట్టాడు. దాంతో భారీ పేలుడు సంభవించి జవాన్ల వాహనాలు ముక్కలు ముక్కలయ్యాయి. సైనికుల శరీర భాగాలు ఛిద్రమై..అక్కడికక్కడే చాలా మంది చనిపోయారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనను కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. కాగా కేరళలోని వయనాడ్ జిల్లాకు చెందిన వీవీ వసంతకుమార్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహానికి సొంత ఊరిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న కేంద్ర టూరిజం శాఖ మంత్రి అల్ఫోన్స్ కన్నదానం ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. అసలు విషయం ఏమిటంటే... అంత్యక్రియల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి.. వసంతకుమార్ మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. అనంతరం ఆ శవపేటిక వద్ద సెల్ఫీ తీసుకున్నారు.‘సీఆర్పీఎఫ్ జవాన్ అంత్యక్రియలు అతని ఇంటి వద్ద పూర్తయ్యాయి. అలాంటి వారి వల్లే నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను.’ అని తన పోస్టుకి క్యాప్షన్ పెట్టారు. అయితే, శవపేటికతో సెల్ఫీ వివాదం కావడంతో దాన్ని తర్వాత తొలగించారు.