ఎంపీ టికెట్ విషయంలో అవినాష్‌, వివేకా మధ్య వివాదం

 

వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతిపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, చింతిస్తున్నామని.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు నిష్పాక్షిపాతంగా జరగాలని, తప్పు చేసిన వారిని ఉరి తీయాలి అని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని పత్రికలు, ఛానళ్ల ముందు వైసీపీ వారు లేనిపోని ఆరోపణలు చేస్తూ.. తాను, ముఖ్యమంత్రి, లోకేష్, సతీష్‌రెడ్డి పులివెందులలో ఎదుర్కోలేక కుట్రకు పాల్పడ్డామని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. 'ఎక్కడో జరిగిన దాన్ని మాకు ఆపాదించడం ఎంత వరకు సమంజసం? గతంలో జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసులో కూడా నాపై ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. ఎన్నికలను నిజాయతీగా ఎదుర్కోలేకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ సీటు విషయంలో వైఎస్‌ కుటుంబంలో వివాదాలు ఉన్నాయి. వివేకా ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఓడిపోయినప్పటి నుంచి ఆయన ఆవేదనలో ఉన్నారు. టికెట్ విషయంలో అవినాష్‌రెడ్డికి, వివేకానందరెడ్డికి మధ్య వివాదం ఉంది అన్నారు. గతంలో విజయమ్మపైనా వివేకానందరెడ్డి పోటీ చేసారని గుర్తు చేశారు. ఇంట్లో జరిగిన దానిని తొలుత ఒక విధంగా చెప్పడం, మళ్లీ ముఖ్యమంత్రిపై, తనపై ఆరోపణలు చేయడమేంటని మంత్రి ప్రశ్నించారు. మొదట గుండెపోటు అని ఆ తర్వాత మాట మార్చారని మండిపడ్డారు. సీట్ల పంచాయతీలో మేం ఉంటే.. మాపై ఆరోపణలు చేయడం సమంజసమేనా? ఫ్యాక్షన్‌ వద్దని ప్రశాంతంగా ఉంటున్న మాపై ఆరోపణలా? గతంలో కోడికత్తి విషయంలో ఆరోపణలు చేశారు. అసలు నాకూ కోడికత్తికి ఏమైనా సంబంధం ఉందా?’ అని ప్రశ్నించారు. వాళ్లలో వాళ్లకు అంతర్గతంగా ఏమైనా ఉంటే వారు చూసుకోవాలే తప్ప రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని ఆదినారాయణరెడ్డి సూచించారు.