మహేష్ బాబు రాక!..మీడియా ఫై అసహనం:గల్లా
Published on: Mon Jan 9, 2012 2:36PM
న్యూఢి
ల్లీ: మంత్రి గల్లా అరుణ కుమారి సోమవారం కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. అనంతరం ఆమె న్యూఢిల్లీలో మీడియాతో హీరో ప్రిన్స్ మహేష్ బాబును తాను రాజకీయాల్లోకి తీసుకు రావడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అరుణ కుమారి మహేష్ బాబును రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నారన్న మీడియా కథనాలపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ తాను మహేష్‌ను రాజకీయాల్లోకి తీసుకు రావడమేమిటని ప్రశ్నించారు. ఆజాద్‌ను కలిసి చిత్తూరు అర్బన్, చంద్రగిరి ఆసుపత్రిలకు నిధులు కేటాయించమని కోరానని తెలిపారు.
కాగా కాంగ్రెసు పార్టీ మహేష్ బాబుకు గాలం వేస్తోందని మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ బాబును రాజకీయాల్లోకి తీసుకు రావడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, సిఎం జిల్లాకే చెందిన మంత్రి గల్లా అరుణ కుమారి ద్వారా మహేష్‌ను రాజకీయాల్లోకి తీసుకు రావాలని, ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు శేషగిరి రావు కాంగ్రెసు పార్టీలో ఉన్నందున దానిని కూడా ఆసరాగా చేసుకొని మహేష్‌ను లాగితే పార్టీకి పెద్ద అసెట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయనను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపించాయి. అంతేకాదు ఎమ్మెల్సీ రంగారెడ్డి కూడా మహేష్ బాబు పార్టీలోకి వస్తే తగిన స్థానం కల్పిస్తామని ఓ మీడియా ఛానెల్‌తో అన్నారు. శేషగిరి రావు మొదటి నుండి కాంగ్రెసులో ఉన్నారని, కృష్ణ కుటుంబానికి కాంగ్రెసుతో అనుబంధముందని చెప్పారు.


