TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నీళ్ళపేరిట రూ. 28కోట్లు స్వాహా

Published on: Thu Feb 16, 2012 2:41PM

నిజామాబాద్ జిల్లాలో మినీ వాటర్ స్కామ్
నిజామాబాద్ జిల్లా:'దాహంవేస్తుంటే బావి తవ్వుతున్నట్లు'... గా తయారైంది నిజామాబాద్ జిల్లా పాలకులు, అధికారుల వైఖరి. వేసవివచ్చి తాగునీటి కొరత ఏర్పడితేనే అటువైపు దృష్టి సారిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించడం లేదు. ప్రజల అవసరాలను అవకాశంగా మలుచుకుని ఇష్టారాజ్యంగా నిధులు కాజేస్తున్నారు. గత నాలుగేళ్ళలో తాగునీటి ఎద్దడి పేరుతో రూ.28కోట్ల నిధులు తాగేయడం తాత్కాలిక దోపిడీకి నిలువేత్తు నిదర్శనం. ఎన్ని నిధులు ఖర్చు చేసినా బూడిదలో పోసిన పన్నీరులా ఔతున్నాయే తప్ప ప్రజల గొంతును తడిపిన దాఖలాలు లేవు.
   

 

ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు శాశ్వత పనులకంటే తాత్కాలిక పనులకే ప్రాధాన్యమిస్తున్నారు. వేసవిలో మాత్రం హంగామా చేస్తున్నారు. ఫిబ్రవరి రాగానే వేసవి ప్రణాళిక తయారుచేయడం, గతంలో చేసిన పనులకే నిధులు మంజూరు చేయించడం, రెండు నెలల్లోనే విచ్చలవిడిగా ఖర్చుచేయడం నిరంతరం ప్రక్రియగా మారింది. స్థానికంగా ఉండే రాజకీయ పార్టీల నాయకులకే ఈ కాంట్రాక్టు బాధ్యతలు అప్పగిస్తున్నారు. పనులు, రికార్డులు, బిల్లులు అన్నీ కాగితంపైనే చేసి నిధులు తాగేస్తున్నారు. వాటిని ఆడిట్ కూడా చేసే దిక్కులేదు. ఇలా 2008 నుంచి 2011  వరకు సుమారు రూ.28 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మరో 16 కోట్ల రూపాయలకు ఎసరు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.