ఆలోచన బాగుంటే మెదడు కూడా ఎదుగుతుంది

మనిషి నుదురు విశాలంగా ఉంటే అది అతని పెద్ద మెదడుని సూచిస్తుందనీ, పెద్ద మెదడు తెలివితేటలని సూచిస్తుందనీ పెద్దలు చెబుతూ ఉండేవారు. ఇందులో నిజానిజాల గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు తర్జనభర్జనలు పడుతూనే ఉన్నారు. ఆ సంగతేమో కానీ ఇప్పుడు మెదడు ఆకారాన్ని పరిశీలిస్తే, సదరు మనిషి మనస్తత్వం బయటపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు! ఆ మనస్తత్వం ఆధారంగా భవిష్యత్తులో అతను ఎదుర్కోబోయే మానసిక సమస్యలని కూడా అంచనా వేయవచ్చని ఆశిస్తున్నారు.

 

ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, మెదడులో ఉండే కార్టెక్స్‌ అనే ముఖ్యభాగం తీరుని బట్టి వ్యక్తుల ధోరణిని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఈ కార్టెక్స్‌ ఎంత మందంగా ఉంది, ఎంత పెద్దదిగా ఉంది, ఎంతవరకు ముడుచుకుని ఉంది అనే మూడు అంశాల ఆధారంగా ఐదు రకాల లక్షణాలను పసిగట్టారు. నిరాశావాదం (neuroticism), కలుపుగోలుతనం (extraversion), విశాల దృక్పథం (openness), పరోపకారం (altruism), ఆత్మస్థైర్యం (conscientiousness) అనేవే ఆ ఐదు లక్షణాలు.

 

ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు దాదాపు 500 మంది వ్యక్తుల మెదడు తీరుని గమనించారు. కార్టెక్స్‌ బాగా మందంగా ఉన్న వ్యక్తులలో నిరాశావాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి దృక్పథం ఉన్న వ్యక్తులు సహజంగానే మానసికమైన రోగాలను కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా విశాలమైన దృక్పథం ఉన్న మనుషులలో కార్టెక్స్ తక్కువ మందంతోనూ, ఎక్కువ వైశాల్యంతోనూ కనిపించింది.

 

మెదడు ఓ చిత్రమైన అవయవం. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచీ యవ్వనం వచ్చేంతవరకూ కూడా ఆ మెదడులో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మన ఆలోచనా తీరు, మన అలవాట్లు కూడా మెదడు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. మెదడులోని కార్టెక్స్ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకోవాలంటే దానికి ఒకే ఉపాయం ఉంది. అది తన మందాన్ని తగ్గించుకుని వైశాల్యాన్ని పెంచుకోవాలి. అలా పెరిగిన వైశాల్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముడతలు పడాలి.

 

ఒక్క మాటలో చెప్పాలంటే రబ్బరు షీటుని మడిచిపెట్టినట్లుగా కార్టెక్స్‌ కూడా మడతలు మడతలుగా మారడం వల్ల తనకి ఉన్న ప్రదేశంలోనే ఎక్కువ విస్తరించగలుగుతుందన్నమాట. మెదడులో ఇలాంటి మార్పులు వచ్చేందుకు మన ఆలోచనలు కూడా దోహదపడతాయని ఇప్పుడు తెలిసిపోయింది. మనుషులు పెద్దవారయ్యే కొద్దీ వారిలో తిరుగుబాటు ధోరణి, బాధ్యతారాహిత్యం, నిరాశావాదం తగ్గడానికి కారణం కూడా మెదడులో వచ్చే మార్పులే కారణం అంటున్నారు. అదీ విషయం! అంటే మన మెదడు శుభ్రంగా ఎదగాలంటే ఆలోచనల్లో పరిపక్వత ఉండాలన్నమాట!

 

- నిర్జర.