ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన ఎంఐఎం నేత

 

తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం శాసనసభ్యుడు ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రమాణం చేశారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అహ్మద్‌ ఖాన్‌తో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, శాసనసభ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు పలువురు తెరాస, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీలో సీనియర్‌ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ ఆరుసార్లు ఎమ్మెల్యే ఎన్నికైన ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రొటెం స్పీకర్‌ గా ప్రతిపాదించారు. 1994 నుంచి 2014 వరకు యాకత్‌పురా నుంచి,తాజాగా జరిగిన ఎన్నికల్లో చార్మినార్ నియాజకవర్గం నుంచి అహ్మద్‌ ఖాన్‌ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్‌ సమక్షంలో తెలంగాణ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.