మొన్న అసద్.. నిన్న అక్భర్‌కు సెగ! ఎంఐఎం చేతులెత్తెసినట్టేనా?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జిమ్మిక్కు జరగనుందా? పతంగి పార్టీకి ఊహించని ఫలితాలు రాబోతున్నాయా?  ఓల్డ్ సిటీ బాద్ షాలకు షాక్ తగలనుందా?. అంటే అవుననే సమాధానమే వస్తోంది. 
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. పాతబస్తిలో తమకు తిరుగులేదని భావించే ఎంఐఎం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలుస్తోంది. 
ఓల్ట్ సిటీలో ఇప్పటివరకు పతంగి పార్టీదే హవా. గత నాలుగు పర్యాయాలుగా వారికి 45 నుంచి 50 డివిజన్లు వస్తున్నాయి. పాతబస్తీలో పతంగి పార్టీకి పోటీ ఇచ్చే స్థాయిలోనూ ఏ పార్టీ నిలవడం లేదు. అయితే 
ప్రస్తుతం పాతబస్తీలో సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. బాద్ షా అనుకుంటున్నవారికే దిమ్మతిరిగే షాకులు తగులుతున్నాయి. 

గతంలో ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడాలంటేనే పాతబస్తీలో భయపడేవారు. ఒవైసీల గురించి అయితే అసలు చెప్పనవరసం లేదు. ఒవైసీ బ్రదర్స్ ముందు నిలబడటానికి కూడా ఎవరూ సాహసించేవారు 
కాదు. కాని ఇప్పుడు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా పాతబస్తిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ పార్టీ లీడర్లను ప్రజల నుంచి చీత్కారాలు ఎదురవుతున్నాయి. అంతేకాదు ఏకంగా ఒవైసీ బ్రదర్స్ నే 
నిలదీస్తున్నారు ఓల్ట్ సిటీ ఓటర్లు. సమస్యలు పరిష్కరించాలని ధైర్యంగా అడుగుతున్నారు. వరదల సమయంలో ఎంఐఎంకు వ్యతిరేకంగా చాలా ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ ఎంఐఎం నేతలు జనాగ్రహాన్ని చవి చూస్తున్నారు. 

ముషిరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి తరపున ప్రచారానికి వెళ్లిన ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్భరుద్దీన్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల సభలో మాట్లాడేందుకు అక్భర్ మైక్ దగ్గరకు రాగానే ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు వరద సాయం అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కామ్ గా ఉండాలని మూడు, నాలుగు సార్లు అక్బరుద్దీన్ కోరినా  ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అసహనానికి గురైన అక్భరుద్దీన్  ప్రసంగించడం ఆపేశారు. తనకు చాలా పని ఉందని, వెళ్లిపోతున్నానని.. డిసెంబర్ 1న జరిగే పోలింగ్ లో ఎంఐఎం అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని చెప్పి వేదిక దిగి నిమిషాల్లో  అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్భర్ సభ నుంచి మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో స్థానిక ఎంఐఎం కార్యకర్తలు షాకయ్యారు. 

జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌ తరుఫున ప్రచారానికి వెళ్లిన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఓవైసీని స్థానిక ముస్లిం మహిళలు అడ్డుకున్నారు. వరద సాయంపై వారు అసద్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు వరద సాయం పదివేలు అందలేదని... ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఏం చేస్తున్నారని ఆ మహిళలు ప్రశ్నించారు. మహిళల నిరసనతో అసదుద్దీన్ షాక్ తిన్నారు. గతంలో కూడా ఎంఐఎంని గెలిపిస్తే జాంబాగ్‌లో ఎలాంటి అభివృద్ధి లేదని, ఐదేళ్లకోసారి వచ్చి ఓట్లు అడిగి.. గెలవగానే ముఖం చాటేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనతో వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండానే, అక్కడ  ప్రచారం చేయకుండానే అసదుద్దీన్‌ ఓవైసీ వెనుదిరిగారు. 

పాతబస్తిలోని చాలా డివిజన్లలో ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది.ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను ఓటర్లు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రోడ్డు వేయడం లేదని, తాగునీరు సరిగా రావడం లేదని ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోవడం లేదని మహిళలు మండిపడుతున్నారు. పాతబస్తీలో వచ్చిన మార్పులతో ప్రస్తుతం ఎంఐఎం నేతలకు వణుకు పుడుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ఇతర పార్టీల వారు ప్రచారానికి వస్తే అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. అక్బర్ బాగ్ డివిజన్ సపోటాబాగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఓల్డ్ సిటీలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఓల్డ్ సిటీలో జరుగుతున్న పరిమాణాలతో పతంగి పార్టీకి కష్టాలు మొదలయ్యాయనే చర్చ జరుగుతోంది. పరిస్థితిని గమనించడం వల్లే అసద్, అక్భర్ లు పాదయాత్రలు చేస్తున్నారని చెబుతున్నారు.