రాయల తెలంగాణాకు ఎం.ఐ.ఎం. మద్దతు
Published on: Fri May 4, 2012 10:02AM
కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు రాయల తెలంగాణా ఏర్పాటు చేయాలంటూ కూనిరాగాలు తీస్తున్నారు. మాజీమంత్రి జెసి దివాకరరెడ్డి, ప్రస్తుత మంత్రి టి.జి.వెంకటేష్ తదితరులు రాయలసీమను తెలంగాణలో విలీనం చేసి రాయల తెలంగాణాగా ఏర్పాటుచేస్తే తమకు అభ్యంతరం లేదని అంటున్నారు. అయితే ఈ వాదాన్ని టి.ఆర్.ఎస్.తో పాటు తెలంగాణా ప్రాంత కాంగ్రెస్, టిడిపి నాయకులు కూడా తోసిపుచ్చు తున్నారు. కానీ అనూహ్యంగా ఈ రాయల తెలంగాణా వాదనకు ఎం.ఐ.ఎం. మద్దతు లభించింది. ఎం.ఐ.ఎం. అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ని కలుసుకుని రాయల తెలంగాణాకు మద్దతు ఇచ్చినట్లు తెలిసింది. అయితే తాము సమైక్యాంధ్రకె కట్టుబడి ఉన్నామని ఆయన అన్నట్లు తెలిసింది. ఒకవేళ రాష్ట్రాన్ని విభాజించాల్సి వస్తే తెలంగాణా, రాయలసీమలను కలిపి రాయలతెలంగాణా ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నట్లు తెలిసింది. అంతేకాక హైదరాబాద్ ను కేంద్ర పాలితప్రాంతంగా చేయాలన్న అభిప్రాయాలను కూడా ఆయన వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.


