ఆ ఊరిలో అంతా లక్షాధికారులే


మహారాష్ట్ర-  ఈ పేరు వింటే శివాజీ వంటి వీరులు స్ఫురిస్తారు. గోదావరితో సస్యశ్యామలం అయిన పంటలు కూడా గుర్తుకువస్తాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్ర అంటే కరువు. అలాంటి ఇలాంటి కరువు కాదు... తాగేనీరు కూడా రైళ్లలో తెప్పించుకోవాల్సిన దుస్థితి. గత కొద్ది సంవత్సరాలుగా మహారాష్ట్ర కరువు మరీ విలయతాండవం చేస్తోంది. అహ్మద్‌నగర్‌ వంటి జిల్లాలలో అది రైతులని ఆత్మహత్యకి పురికొల్పుతోంది. కానీ అదే అహ్మద్‌నగర్ జిల్లాలోని ఓ ప్రాంతం మాత్రం పచ్చగా కళకళలాడుతోంది. అదే ‘హివారే బజార్‌’ (Hiware Bazar) గ్రామం.


హివారే బజార్ ఓ సాధారణ గ్రామం. దానికంటూ ఎలాంటి ప్రత్యేకతా ఉండేది కాదు. పైపెచ్చు 1972లో వచ్చిన కరువుతో ఆ గ్రామం పేదరికంలోకి జారిపోయింది. బీడుపడిన పంటపొలాలని వదలి ఆ గ్రామప్రజలు ఎక్కడెక్కడికో వలస వెళ్లిపోయారు. ఏళ్లు గడిచేకొద్దీ ఆ గ్రామం పేరుకి మాత్రమే ఊరుగా మిగిలింది. అలా సాగిపోతున్న ఆ గ్రామవాసుల జీవితంలోకి 1990లో ఒక మార్పు వచ్చింది.


1990లో జరిగిన గ్రామ సర్పంచి ఎన్నికలలో ‘పోపట్‌రావ్ పవార్‌’ అనే కుర్రవాడు నిలబడ్డాడు. చదువుకున్నవాడు కావడంతో, ఆయననే తమ సర్పంచిగా ఎన్నుకొన్నారు ఆ గ్రామ ప్రజలు. ఆ ఎన్నికే వారి జీవితాన్ని మార్చివేసింది. పవార్ సర్పంచిగా ఎన్నికైన దగ్గర్నుంచీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. గ్రామంలో మద్యాన్ని నిషేధించాడు. పచ్చని చెట్లని నరకడం కానీ, మేత కోసం వాడటం కానీ చేయకూడదని తీర్మానించాడు. కుటుంబ నియంత్రణ, శ్రమదానం వంటి కార్యక్రమాలకి సిద్ధంగా ఉండాలని సూచించాడు.


ఒకపక్క గ్రామంలోని పరిస్థితులను చక్కబెడుతూనే మరోపక్క నీటి వసతి పెరిగే ఏర్పాట్లు చేశాడు పోపట్‌రావ్‌. ఎక్కడికక్కడ కాల్వలు తవ్వించడం, ఆనకట్టలు కట్టించడం, చెరువులు పూడికలు తీయించడం లాంటి పనులతో వర్షపు నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేశాడు. దాంతోపాటుగా రైతులు పంటలు వేసుకునేందుకు, ఆ పంటలను మార్కెట్‌ చేసుకునేందుకు అవసరమయ్యే రుణాలన్నీ మంజూరయ్యేలా చూశాడు. నీటిని ఎక్కువగా వాడిపారేసే చెరకు, అరటి లాంటి పంటలు మాత్రం వేయకూడదని గ్రామస్తులకు సూచించాడు. ఎప్పటికీ లాభసాటిగా ఉండే పాల ఉత్పత్తి, పూల మొక్కల పెంపకం లాంటి పనులు చేపట్టేలా ప్రోత్సహించాడు.


గ్రామస్తుల జీవితాలు మెరుగుపడటానికి పోపట్‌రావ్ చేయని పనంటూ లేదు. బడి దగ్గర నుంచీ స్మశానవాటిక దాకా వారికి కావల్సిన సదుపాయాలన్నీ ఏర్పరిచారు. ఇలాంటి చర్యలతో ఆ గ్రామం రూపురేఖలే మారిపోయాయి. రాష్ట్రం అంతా కరువుతో విలవిల్లాడుతున్నా, అక్కడ మాత్రం పొలాలు విరగపండాయి. 1995లో 830గా ఉన్న నెలసరి ఆదాయం 2012 నాటికి 30 వేలకు చేరుకుంది. 

ప్రస్తుతం హివారే బజార్‌లో పదిలక్షల రూపాయలకు పైగా ఆస్తి ఉన్నవారి సంఖ్య 60కు పైగా చేరుకుంది. రెండు వందలకు పైగా కుటుంబాలలో కేవలం మూడు కుటుంబాలే దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నాయి. ఒకప్పుడు ఊరు విడిచి వెళ్లిన కుటుంబాలన్నీ తిరిగి వచ్చేశాయి.
‘హివారే బజార్‌’ గ్రామానికి బోలెడు అవార్డులు వచ్చాయని వేరే చెప్పాలా! అలాంటి అవార్డులూ గుర్తింపుల కంటే వారి జీవితాలలో వచ్చిన మార్పే విశిష్టమైనది. అలాంటి మార్పు కేవలం ఒక వ్యక్తి వల్లే రావడం మనందరూ గుర్తుంచుకోదగ్గది.    

                                    - నిర్జర.