ట్రంప్ అమెరికా నీది, కాదు అందరిదీ....నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తాం !

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్  ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ జాతికి చెందిన నలుగురు మహిళా కాంగ్రెస్ సభ్యుల పట్ల ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆమె ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే ఆయనకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా నలుగురు డెమోక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యులపై ట్రంప్ మండిపడ్డారు. మా అమెరికాలో మీరు సంతోషంగా లేకపోతే మీరు పుట్టిన దేశాలకి వెళ్లిపోవాలని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో స్పందించిన మిషెల్ ‘ఇది మా అమెరికా, మీ అమెరికా కాదు. మనందరి అమెరికా’ అని వ్యాఖ్యానించారు. 

అమెరికాలో ప్రతి ఒక్కరికీ చోటు ఉంటుందని, మనం ఇక్కడ పుట్టినా ఇక్కడ నివసిస్తున్నా ఇక్కడున్నవారంతా అమెరికన్లేనని ఆమె చెప్పుకొచ్చింది. అమెరికాకు ఉన్న భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పదనాన్ని చాటుతోందని తెలిపారు.  ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జాతి వివక్ష వ్యాఖ్యలంటూ ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురిలో ఒకరైన ఇల్హన్ ఒమర్ మాట్లాడుతూ, సోమాలియా నుంచి వచ్చిన మహిళ ఎదగడాన్ని ట్రంప్ భరించలేకపోతున్నారని మండిపడ్డారు. ట్రంప్ నిర్ణయాలతో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ట్రంప్ కూడా నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తామని ఆమె హెచ్చరించారు.