బీజేపీ నేతపై మెర్సల్ పైరసీ మచ్చ

విజయ్ ప్రధానపాత్రలో చేసిన మెర్సల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. కొందరు ఈ సినిమాకి మద్దతిస్తుంటే, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలు మెర్సల్ విడుదలయినప్పటినుండి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలపై విమర్శలు చేయడం సరికాదని విజయ్ పై, సినిమా దర్శక, నిర్మాతలపై తమ అసహనం వ్యక్త పరుస్తున్నారు. వత్తిడికి తలొగ్గిన మెర్సల్ నిర్మాత మురళి సినిమాలో నుండి వివాదాస్పద సన్నివేశాలు తొలగిస్తానని ప్రకటించారు.

 

ఇది ఇలా ఉంటే, ఒక టీవీ చర్చలో పాల్గొన్న బీజేపీ నేత హెచ్ డీ రాజా తాను మెర్సల్ సినిమాని ఆన్‌లైన్‌లో చూశానని... ప్రభుత్వ పథకాల్ని విమర్శిస్తూ సినిమా ఉందని వ్యాఖ్యానించారు... అలోచించి మాట్లాడాడో, అనాలోచితంగా ఈ వ్యాఖ్యలు చేసాడో తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం తమిళనాట దుమారం లేపుతుంది. ఒక బాధ్యతగల నాయకుడయి ఉండి పైరసీ చూడడం ఎంత వరకు సమర్ధనీయం అని పలువురు రాజాపై దుమ్మెత్తి పోస్తున్నారు.

 

తమిళ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ ఈ విషయంపై స్పందిస్తూ, రాజా చర్య పూర్తిగా విచక్షణా రహితం అని. తాను నిజంగా ఆశ్చర్యపోయానని ఇలాంటి బాధ్యతగల వ్యక్తులు పైరసీ చూడటమే కాకుండా అది పబ్లిక్ గా ప్రకటించడం హేయమని అభిప్రాయపడ్డారు. మరికొందరు సినీ పరిశ్రమ వ్యక్తులు మెర్సల్ కి తమ మద్దతు తెలుపుతూ బీజేపీ నాయకుడి చర్యని ఖండిస్తున్నారు.