TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేపాల్ మాజీ ప్రధాని, మాజీ హోంమంత్రి అరెస్టు

Published on: Sat Mar 28, 2026 9:27AM

నేపాల్  మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జరిగిన  జెన్ జీ నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, మరణాలకు సంబంధించి ఈ అరెస్టు జరిగింది. ర్యాపర్ నుంచి రాజకీయ నేతగా మారిన బలేంద్ర షా కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ అరెస్ట్ జరగడం విశేషం. ఓలీతో పాటు మాజీ హోం మంత్రి రమేశ్ లేఖక్‌ను కూడా పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు.శనివారం (మార్చి 28) ఈ అరెస్టులు జరిగాయి. దీనిని ఖాట్మండు వ్యాలీ పోలీసులు ధృవీకరించారు. చట్ట ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.  ఈ అరెస్ట్‌లపై ప్రస్తుత హోం మంత్రి సుదన్ గురుంగ్  ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ సామాజిక మాధ్యమ వేదికలో ఓ పోస్టు షేర్ చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్న ఆయన  ఈ అరెస్టులను న్యాయం దిశగా ఓ ముందడుగుగా అభివర్ణించారు.  

నేపాల్ లో నిరుడు  సెప్టెంబర్‌లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన  జెన్ జీ నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన అల్లర్లలో దాదాపు 70 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి ఓలీ ప్రభుత్వం దిగిపోయింది.

ఈ నిరసనలపై గతంలో ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన నివేదికను శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో అమలు చేయాలని నిర్ణయించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఓలీ, లేఖక్‌లకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కమిషన్ సిఫారసు చేసింది.