జ్ఞాపకాలు మోసం చేస్తాయా!


మనిషి అంటేనే జ్ఞాపకాల పుట్ట. అవి లేనిదే అతనికి అస్తిత్వం ఉండదు. అలాంటిది తన జీవితంలో ఎప్పుడూ జరగని దానిని, తనకి ఏమాత్రం సంబంధించని విషయాన్నీ అతను తన జ్ఞాపకంగా భావించడం సాధ్యమేనా! అసలు ఇలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉందా అంటే... నూటికి యాభై శాతం అవకాశం ఉందంటున్నారు.

 

తప్పుడు జ్ఞాపకాలు

ఇంగ్లండుకి చెందిన కొందరు పరిశోధకులు, జ్ఞాపకాలలో పొరపాటు జరిగే అవకాశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీని కోసం వారు ఒక నాలుగువందల మందిని ఎన్నుకొన్నారు. వీరందరి మీదా ఎనిమిది దఫాలుగా జ్ఞాపకానికి సంబంధించిన ప్రయోగాలను నిర్వహించారు. ఈ సమయంలో వారిని తమ జీవితంలో ఎన్నడూ జరగని విషయాలను ఊహించి చూడమన్నారు. బెలూన్లో ఆకాశంలో ఎగరడం, ఉపాధ్యాయులని ఏడిపించడం, పెళ్లిలో చిలిపిగా ప్రవర్తించడం... లాంటి విషయాలను ఊహించుకోమన్నారు.

 

నిజమనుకున్నారు

బలవంతంగా తమవైన ఊహలలో తేలిపోయిన 400 మంది వ్యక్తులనీ తరువాత కాలంలో మళ్లీ ప్రశ్నించారు. ఆ సమయంలో తేలిందేమిటంటే... తాము ఇంతకుముందు ఊహించుకున్న విషయాలని వారు నిజమని భ్రమించడం మొదలుపెట్టారట. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు! ఒక 23 శాతం మంది, ఆ ఊహలన్నీ తమ జీవితంలో నిజమైన సంఘటనలకు సంబంధించినవే అని నమ్మారు. మరో 30 శాతం మందైతే అవి నిజమని నమ్మడమే కాదు... అవి ఎలా, ఎప్పుడు జరిగాయో పూసగుచ్చినట్లు వివరించారు!

 

కొత్త వెలుగులు

మనిషి మెదడులో జ్ఞాపకాలు ఎలా నిక్షిప్తం అవుతాయి అనేదాని మీద ఈ పరిశోధన కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. మన జీవితంలో ఫలానా విషయం జరిగింది అని మనం ప్రగాఢంగా నమ్మేవన్నీ నిజం కాకపోవచ్చునని హెచ్చరిస్తోంది. ఒక అబద్ధాన్ని పదే పదే ఇతరుల మెదడులోకి చొప్పించే ప్రయత్నం చేస్తే అది నిజంగా మారిపోవచ్చునని సూచిస్తోంది. ఇంతకుముందులా ‘ఫలానా హత్యను నేను చూశాను,’ అని న్యాయస్థానంలో చెబితే న్యాయమూర్తులు తొందరపడి ఓ నిర్ణయానికి రాకపోవచ్చు. వేధించే జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ఓ కొత్త మార్గాన్ని వెతుక్కోవచ్చు. పరిశోధకుల మాటలోనే చెప్పాలంటే- ‘జ్ఞాపకాలు మన జీవితానికి చిహ్నాలుగానూ, మన అస్తిత్వంలో భాగంగానూ ఉండే మాట నిజమే! అయితే ఒకోసారి అవి కూడా మనల్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.’

 

 

- నిర్జర.