ఓటమిలోనూ రికార్డ్ తిరగరాసిన మీరా కుమార్..


గెలుపులోనే కాదు.. ఓటమిలో కూడా రికార్డులు సృష్టించే వారు కూడా ఉంటారు. అలానే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేసిన మీరా కుమార్ కూడా ఎన్నికల్లో ఓడిపోయి.. యాభై ఏళ్ల చరిత్రను తిరగరాశారు. ఈ నెల 17న రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పోటీచేయగా.. ప్రతిపక్షాల తరపున మీరా కుమార్ బరిలో దిగారు. రామ్‌నాథ్ కోవింద్ 65.65 శాతం ఓట్లు సాధించగా, మీరాకుమార్‌కు 34.35 శాతం ఓట్లు పోలయ్యాయి. కోవింద్‌కు వచ్చిన ఓట్ల విలువ 7,02,044 కాగా.. మీరాకుమార్‌కు పోలైన ఓట్ల విలువ 3,67,314. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి చెందిన వారిలో అత్యధిక ఓట్లు పోలైన అభ్యర్థిగా 50 ఏళ్ల రికార్డును మీరాకుమార్ చెరిపేశారు. గతంలో 1967లో ఈ రికార్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు పేరిట ఉండేది. అప్పుడు ఆయనకు 3.63లక్షలు ఓట్లు పోలయ్యాయి. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకూ జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 3.63 లక్షల ఓట్లు రాలేదు. ఇప్పుడు మీరా కుమార్ ఆ రికార్డును చెరిపేశారు.