బీజేపీతో పొత్తుకు పీడీపీ స్వస్తి పలికినట్టేనా..!

గత కొద్ది రోజుల నుండి జమ్ము కాశ్మీర్ రాజకీయాల్లో వేడి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌ మరణానంతరం ఆయన కూతురు మెహబూబా ముఫ్తీ సీఎం గా బాధ్యతలు చేపెట్టే విషయంలో ఎన్నో అవకతవకలు ఏర్పడుతున్నాయి. అందుకే మొహమ్మద్‌ సయీద్‌ అంత్యక్రియలు అనంతరం చేపట్టవలసిన బాధ్యతలను ఇంకా చేపట్టలేదు మెహబూబా ముఫ్తీ. అయితే అసలు దీని కారణం ఇంతకుముందు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీకి, పిడిపి (పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ) కి సరిగ్గా సయోధ్య కుదరకపోవడమే. అంతేకాదు ఇటీవలే తమతో కలిసి ఉండాలంటే  బీజేపీకి కొన్ని షరతులు కూడా విధించారు మెహబూబా ముఫ్తీ. ఆ షరతులకు బీజేపీ సంగ్దిగ్ధంలో పడింది. దీంతో కేంద్రనుంచి ''విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యల'' విషయంలో స్పష్టమైన హామీ లభించని పక్షంలో బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని మెహబూబా అన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక పిడిపీ బీజేపీ పొత్తుకు స్వస్తి పలికినట్టే అని వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.