పోలవరం టెండర్‌ను దక్కించుకున్న మేఘా... గతంలో జగన్ విమర్శించిన సంస్థే

 

రివర్స్‌ టెండరింగ్‌లో భాగంగా పోలవరం కాంట్రాక్టును రద్దు చేసిన జగన్ ప్రభుత్వం.. తిరిగి టెండర్‌ను పిలిచిన విషయం తెలిసిందే. పోలవరం హెడ్‌ వర్క్స్‌లో మిగిలిపోయిన పనులతో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి రివర్స్ టెండర్‌ పిలిచింది. అయితే తాజాగా పోలవరం ప్రధాన టెండరును మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ.4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా.. మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ.4358 కోట్లకు కోట్ చేస్తూ టెండర్ దాఖలు చేసింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే 12.6% శాతం తక్కువకు మేఘా కోట్ చేసింది. దీంతో పోలవరం కాంట్రాక్టును మేఘా సంస్థ దక్కించుకుంది. కోర్టు అనుమతులు లభించిన వెంటనే మేఘా సంస్థ పనులను ప్రారంభించనుంది. కాగా, తాజా టెండరింగ్‌తో రూ.628 కోట్లు ఆదా అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది.

అయితే సీఎం జగన్ కు కొత్త తలనొప్పి మొదలైందని తెలుస్తోంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి గురించి పదే పదే ప్రస్తావించేవారు. చంద్రబాబు హాయంలో పట్టి సీమ ప్రాజెక్టులో మేఘా సంస్థకు వందలాది కోట్లు దోచిపెట్టారని నాడు జగన్ విమర్శలు చేసారు. మరోవైపు పోలవరంలో అవినీతి అంటూ రివర్స్ టెండర్‌ కు వెళ్లారు. తీరా చూస్తే పోలవరం కాంట్రాక్టును గతంలో జగన్ విమర్శలు చేసిన మేఘా సంస్థనే దక్కించుకుంది.