బీజేపీలోకి చిరంజీవి.. మళ్ళీ తప్పటడుగు వేస్తున్నారా?

 

ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ.. అందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ మెగాస్టార్ చిరంజీవిని పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో పార్టీలో ఉండీ లేనట్టుగా ఉన్న చిరంజీవి.. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేయలేదు. 2018 ఏప్రిల్ లో రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియడంతో అప్పటినుండి ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తన సినిమా షూటింగులతో బిజీ అయిపోయి రాజకీయాలతో తనకు ఏ సంబంధం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవిని మళ్ళీ పాలిటిక్స్ లో యాక్టీవ్ చేయాలని బీజేపీ భావిస్తోందట. చిరంజీవిని పార్టీలో చేర్చుకొని కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోందట.

ఏపీలో దాదాపు 70 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపధ్యంలో చిరంజీవిని పార్టీలోకి తీసుకుని ఆయన అంగీకరిస్తే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాంమాధవ్, కన్నా లక్ష్మీ నారాయణ సహా కొందరు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

రాజకీయాల్లో చిరంజీవి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారనే చెప్పాలి. సోదరుడు పవన్ కళ్యాణ్ కి కూడా ఇటీవల జరిగిన ఎన్నికలలో నిరాశే ఎదురైంది. మరి చేదు అనుభవాలను మిగిల్చిన రాజకీయాల వైపు చిరంజీవి మళ్ళీ అడుగులు వేస్తారా? బీజేపీ ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరే సాహసం చేస్తారా? చూద్దాం ఏం చేస్తారో.