ఇంత జరుగుతుంటే చిరంజీవి ఎక్కడ..?

విభజన హామీలను ఏమాత్రం పట్టించుకోకపొగా.. బడ్జెట్‌లో చిల్లిగవ్వ విదిల్చని కేంద్రప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు నిరసన గళం వినిపిస్తున్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం మన ఎంపీలందరూ ఒక్కతాటిపై నడుస్తున్నారు.. అందరూ చేతులు కలపకపోయినప్పటికీ.. అందరూ ఒక్కతాటిపై నిలబడి కేంద్రానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌ ఇలా అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు.. తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.

 

కుదిరితే లోపల.. లేదంటే బయట అన్నట్లుగా "సేవ్ ఆంధ్రప్రదేశ్.. హెల్ప్ ఆంధ్రప్రదేశ్" అంటూ ఫ్లకార్డులు పట్టుకొని కథం తొక్కుతున్నారు. లోక్‌సభ, రాజ్యసభ అన్న తేడా లేకుండా ఏపీ ఎంపీలంతా.. ఢిల్లీలో మకాం పెడితే ఒక ఎంపీ మాత్రం పత్తా లేకుండా పోయాడు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాల్సిన చిరు.. ఇంత గందరగోళ పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉండటం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ సందర్భంగానైనా పోరాడి జనాల్లో కాస్తంత చోటు సంపాదించాలని తహతహలాడుతోంది.

 

మరి అదే కాంగ్రెస్ సభ్యుడైయుండి చిరు ఏం చేస్తున్నట్లు. పార్టీ సంగతి వదిలేసినా.. ఏదో ఒకటి చేస్తాడని మెగాస్టార్‌పై ప్రజల్లో కాస్తో కూస్తో పాజిటివ్‌నెస్ ఉంది. అలాంటిది ఎంపీ హోదాలో బడ్జెట్ వంటి కీలక వ్యవహారంపై కనీస స్పందన లేకుండా.. మీడియా కంటికి దొరక్కుండా తప్పించుకుని తిరుగుతూ.. చివరికి పార్లమెంట్‌కు కూడా వెళ్లడం లేదు చిరంజీవి. కేవీపీ రామచంద్రరావు వంటి వయసు పైబడిన వ్యక్తి కూడా రాజ్యసభలో ఫ్లకార్డులతో నిరసన తెలుపుతుంటే.. సినీనటుడిగా జనాకర్షణ ఉన్న వ్యక్తి ఇంట్లో ఉండటమేంటీ..? ఒకవేళ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడా అంటే అదీ లేదు.. మరి చిరంజీవి ముడుచుకుని కూర్చోవడం వెనుక అసలు రీజన్ ఏంటీ..? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.