జగన్ సంచలన నిర్ణయం.. 'మీ సేవ' కేంద్రాలు మూసివేత!!

 

వైఎస్ జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తన నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. పౌర సేవలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న 'మీ సేవ' కేంద్రాలను రద్దు చేసే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. అక్టోబరు 2నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందాలన్న లక్ష్యంతో గ్రామాల్లో  సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ సచివాలయాల రాకతో ఇప్పటికే రేషన్ దుకాణాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు రేషన్ దుకాణాల తరహాలోనే మీ- సేవ కేంద్రాలకు కూడా ఇక కాలం చెల్లినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. మీ సేవలో అందించే పౌర సేవలన్నీ ఇక మీదట గ్రామ సచివాలయాల నుంచి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

మీ సేవ కేంద్రాలను మొదట ఇ సేవ పేరుతో 2003లో ఏర్పాటు చేశారు. తొలుత నాలుగు రకాల సేవలతో ప్రారంభమైన మీ సేవ నేడు 367 రకాల ప్రభుత్వ సేవలు, మరో 30 రకాల ప్రైవేటు సేవలు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 11,054 కేంద్రాలకు దశల వారీగా ప్రభుత్వం అనుమతిలిచ్చింది. ఇందులో రెండువేలకు పైగా మీ సేవలు పనులు లేక నిరుపయోగంగా మారడంతో మూతబడ్డాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్‌ మీ సేవ కేంద్రాలు సుమారుగా 200 వరకు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రాంచైజీల కింద దాదాపు 9 వేల మీ సేవ కేంద్రాలు పౌరులకు సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రద్దు చేసే మీ సేవ కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్‌ మీ సేవ కేంద్రాలు ఉంటాయా? లేక ఫ్రాంఛైజీల ద్వారా నడిచే మీ సేవ కేంద్రాలు ఉంటాయా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రైవేటు ఏజెన్సీల గడువు ముగియడంతో కార్పొరేట్‌ కంపెనీలకు మీ సేవ సాప్ట్‌వేర్‌ అగ్రిమెంట్లను బదిలీ చేయవచ్చని భావిస్తున్న తరుణంలో గ్రామసచివాలయాల ద్వారా పౌర సేవలందించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. మీ- సేవలు రద్దు కానున్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో వీటిల్లో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు రోడ్డున పడుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ మీ సేవ కేంద్రాల మూసివేతకు ప్రభుత్వం సిద్దమైతే అందులో పని చేస్తున్న సిబ్బంది.. రేషన్ డీలర్ల తరహాలోనే రోడ్డెక్కే అవకాశముంది. వీరికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయం చూపుతుందో చూడాలి.