తెలంగాణాపై కాంగ్రెస్ డ్రామా

 

ఇక నేడో రేపో తెలంగాణా బిల్లుని రాష్ట్రశాసనసభలో, పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సర్వం సిద్దం చేసుకొన్న ఈ తరుణంలోకూడా కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణా అంటూ మీడియాకు లీకులు ఇవ్వడం ఒక విచిత్రమనుకొంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల మద్దతుతో రాష్ట్ర విభజనను అడ్డుకొంటానని రచ్చబండ మీద నిలబడి రంకెలు వేస్తుండటం మరో విచిత్రం. అదే సమయంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు ఆమోదం కూడా పొందుతుందని తన అపార రాజకీయ అనుభవంతో చెపుతున్నానని అనడం చూస్తే కాంగ్రెస్ ఈ ప్రక్రియని ఎంత లౌక్యంగా ముందుకు తీసుకువెళుతోందో అర్ధం అవుతుంది.

 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయమే శిరోధార్యమని చెప్పే కాంగ్రెస్ నేతలు మళ్ళీ మధ్యలో ఈ రాయల తెలంగాణా ప్రసక్తి ఎందుకు తెస్తున్నారంటే ప్రజలని గందరగోళ పరచడానికే, లేకుంటే రెండు ప్రాంతాల ప్రజలు కూడా వ్యతిరేఖిస్తున్నారని తెలిసికూడా ఈవిధంగా మాట్లాడేవారు కారు.

 

ఇక రాయల తెలంగాణా పేరు చెప్పి తెరాసను లొంగ దీయలనుకొంటోందనే వాదన కూడా నమ్మశక్యంగా లేదు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆపార్టీయే నష్టపోతుంది తప్ప తెరాసకు వచ్చేనష్టం ఏమిలేదు.

 

ఇటువంటి రకరకాల మీడియా లీకులతో కేవలం సీమాంధ్ర ప్రజలను అయోమయాపరుస్తూ తన పని సజావుగా కానీయడానికే కాంగ్రెస్ నేతలందరూ సమిష్టిగా కష్టపడుతున్నారు. ఇక రాష్ట్ర విభజన విషయంలో తన అధిష్టానాన్ని నిత్యం విమర్శించే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దానిని అడ్డుకొనే ప్రయత్నమేదీ చేయకపోయినా, ఇలాగ రచ్చబండ మీద నిలబడి రంకెలు వేస్తూ ప్రజలలో తన పరపతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఆయనే స్వయంగా తన అధిష్టానానికి ఈ ప్రక్రియ సజావుగా పూర్తిచేసేందుకు అవసరమయిననంత సమయం కల్పిస్తున్నారు. మొత్తం ప్రక్రియ అంతా పూర్తి అయిపోయిన తరువాత తెలంగాణా బిల్లు మొక్కుబడిగా రాష్ట్రశాసన సభకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన్న బిల్లు ఆగిపోదని సామాన్య ప్రజలకి కూడా తెలుసు. అటువంటప్పుడు తను విభజనను అడ్డుకొంటానని ఆయన చెప్పడం కేవలం ప్రజలని మభ్యపెట్టడానికే.

 

ఇటువంటి తరుణంలో జైపాల్ రెడ్డి చెప్పిన మాటలనే ప్రామాణికంగా తీసుకొంటే, పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు తప్పక ఆమోదం పొందుతుందని అర్ధం అవుతోంది. అయితే అందుకు అవరోధంగా ఉన్నరాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డీ)ని కాంగ్రెస్ ఏవిధంగా అధిగమిస్తుందనే ఒకే ఒక అంశంపై తగిన వివరణ అవసరం. దానిపై కాంగ్రెస్ అధిష్టానంలో పెద్దలు కానీ, కేంద్రమంత్రుల బృందంలో సభ్యులెవరూ గానీ ఇంతవరకు పెదవి విప్పకపోవడం చూస్తే, దానిని అధిగమించేందుకు కూడా వారికి తగిన వ్యూహం ఉందని అర్ధం అవుతోంది. అందువల్ల ఇక పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టబడే వరకు వచ్చే మీడియా లీకులన్నీ కేవలం ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించడానికే.