TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కన్నెపల్లి నుంచి గద్దెపైకి చేరుకున్న సారలమ్మ

Published on: Wed Jan 28, 2026 8:04PM

 

మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు బయలుదేరారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజారులు ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి పడిగెను తీసుకుని భారీ బందోబస్తు నడుమ మేడారం వైపు అడుగులు వేశారు. లక్షలాది మంది  భక్తుల కోలాహలం, డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య  సారలమ్మ మేడారం చేరుకుంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్క హాజరయ్యారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కూడా కన్నెపల్లి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లో కోయ గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క  కోయ నృత్యంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తుల రద్దీ దృష్ట్యా కన్నెపల్లి సారలమ్మ గుడి సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ పోలీసు భద్రత నడుమ సుమారు 3.5 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి వనదేవతా గద్దెపైకి చేరుకుంది

భక్తుల భద్రతకు 40 మొబైల్ అంబులెన్స్‌లు

శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్ సేవలను విస్తృతంగా ఏర్పాటు చేసింది. మేడారం జాతర ప్రాంతమంతటా మొత్తం 40 ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్‌లను వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించారు. భారీ రద్దీ ఉన్న ప్రాంతాల్లోనూ వేగంగా చేరుకుని వైద్య సహాయం అందించేందుకు వీలుగా ఈ బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ మొబైల్ 108 సేవల ద్వారా జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులకు తక్షణ ఫస్ట్ ఎయిడ్‌తో పాటు అవసరమైన ప్రాథమిక మందులు అందిస్తున్నారు. అలాగే, పరిస్థితి విషమంగా ఉన్న సందర్భాల్లో భక్తులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. జాతర కాలమంతా ఈ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పగడ్బందీ చర్యలు చేపట్టింది.