అమరావతి చేరిన రాజాంపేట పంచాయితీ

 

గత కొంత కాలంగా కడప జిల్లా రాజాంపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై స్పందించిన మేడా కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ..."ప్రతిపక్షం వారితో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, అయితే.. పార్టీలో వారే కొందరు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు" అని స్పష్టం చేశారు.

అయితే రెండు రోజుల క్రితం.. జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లాపార్టీ అధ్యక్షుడు, పలువురు నేతలు రాజంపేటలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేడాను ఆహ్వానించలేదు. దీంతో అనుచరులతో కలిసి మేడా తన ఇంటి వద్దే సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారబోతున్నట్లు మీడియాలో ప్రచారం జరగడంతో..మేడా ప్రెస్‌మీట్ మరోసారి పెట్టి పార్టీలోని పరిణామాలను వివరించారు. మంత్రి వెర్సెస్ ఎమ్మెల్యేగా ఈ పరిణామాలు జరుగుతుండటంతో ఈ పంచాయితీ అమరావతికి చేరింది.

రాజంపేట నియోజకవర్గ ముఖ్య నేతలు ఈ రోజు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మేడా మల్లికార్జున రెడ్డి వ్యతిరేక వర్గం ఇప్పటికే అమరావతికి చేరుకుంది. మేడా పార్టీ మారడం ఖాయమంటూ వారు వాదిస్తున్నారు. మరోవైపు సీఎంతో సమావేశానికి మేడా వర్గం హాజరుపై అనుమానాలు నెలకొన్నాయి. అమరావతిలో చంద్రబాబుతో సమావేశానికి తమకు ఎలాంటి సమాచారం లేదని మేడా అంటున్నారు. అయితే ఫోన్లల్లో కూడా మేడా అందుబాటులోకి  రావడం లేదని టీడీపీ అంటోంది. ఈ నేపథ్యంలో మేడా వర్గం ఈ భేటీకి హాజరుకావడం లేదంటూ ప్రచారం జరుగుతోంది.