వేడెక్కిన రాజంపేట టీడీపీ రాజకీయం.. ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి!!

 

కడప జిల్లా రాజంపేట రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ మారుతున్నట్లు కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మేడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లాపార్టీ అధ్యక్షుడు, పలువురు నేతలు ఇవాళ ఉదయం రాజంపేటలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేడాను ఆహ్వానించలేదు. దీంతో అనుచరులతో కలిసి మేడా తన ఇంటి వద్దే సమావేశం నిర్వహించారు. రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట మండల నాయకులతో ఆయన భేటీ అయ్యారు.

కార్యకర్తలతో సమావేశం అనంతరం మేడా మీడియాతో మాట్లాడారు. పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలపై స్పందించిన ఆయన.. తాను పార్టీ మారుతున్నానని కొందరు ప్రచారం చేశారని.. ఎవరితో సంప్రదింపులు జరపకపోయినా అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తనను అవమానించే విధంగా మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడారని అన్నారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అని ఎన్టీఆర్ చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీలోని కొందరు నాయకులు పత్రికలతో కుమ్మక్కై మీడియాకు లీకులిచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొడ్డిదారిలో మంత్రి అయినవాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు. త్వరలో సీఎం చంద్రబాబును కలిసి అన్ని విషయాలు వివరిస్తానని మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు.