ఐదు రోజుల్లోనే మూడు వేల వెంటిలేటర్ల తయారీ 

* మెడ్ టెక్ జోన్ చీఫ్ జితేందర్ శర్మ చేస్తున్న అద్భుతం-విస్మయం లో అధికార యంత్రాంగం 
* కరోనా కిట్స్ పై పరిశ్రమల మంత్రిది, ముఖ్యమంత్రిదీ తలో మాట! 
* 2016 నుంచి ఇప్పటివరకూ, మెడిటెక్ జోన్ లో తయారీ సామర్ధ్యమున్న కంపెనీలే లేకపోవడం గమనార్హం

 
కేవలం 5 రోజుల స్వల్ప కాలిక వ్యవధిలో, మూడు వేల వెంటిలేటర్ల తయారీ , అలాగే వాటి పంపిణీ సాధ్యమా? సాధ్యమేనంటోంది ఘనత వహించిన ఆంధ్ర ప్రదేశ్ మెడ్ టెక్ జోన్ ( ఏ.ఎం. టీ. జెడ్.).  కిందటి నెల-అంటే, మార్చ్ లో వెంటిలేటర్లు, కోవిడ్ కిట్స్, ఇఫ్రారేడ్ ధర్మో గన్స్ సరఫరాకు టెండర్ పిలిచిన  ఏ.ఎం. టీ. జెడ్ , ఆ టెండర్ ను ఏప్రిల్ 10 వాయిదా వేస్తున్నట్టు మార్చ్ ౩౦ న వెల్లడించింది. వెంటిలేటర్లు, కోవిడ్ కిట్స్ తయారీకి పరిశ్రమల శాఖ మంత్రి విశాఖ మెడ్ టెక్ జోన్ కు రూ. ౩౦ కోట్లు విడుదల చేశారు. ఏప్రిల్ 15లోగా మూడు వేల వెంటిలేటర్లు, 25 వేల కోవిడ్ టెస్టింగ్ కిట్స్ తయారు చేయాలని నిర్దేశం. ఏప్రిల్ 10 కి టెండర్ వాయిదా వేసి 15 నాటికి ఇన్ని వేల వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్స్ ఏవిధంగా తయారు చెయ్యగలరు.  టెండరు ఖరారు కాక ముందే మెడ్ టెక్ జోన్ లో 4 కంపెనీలకు కంపెనీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పరిశ్రమల శాఖలు అనుమతి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కేవలం అసెంబ్లింగ్ పనులకే అనుమతులు ఇవ్వడం గమనార్హం.

మెడ్ టెక్ జోన్ ఎండీ జితేంద్ర శర్మ మాత్రం వైద్య పరికరాలన్నీ ఇక్కడే తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. మెడ్ టెక్ జోన్ లో కోవిడ్ కిట్స్ తయారీకి అనుమతి పొందిన మాల్ బయో అనే కంపెనీని నేషనల్ ఇన్స్టిట్యుట్ అఫ్ వైరాలజీ ఇప్పటికే రెజెక్ట్ చేసింది. కానీ సదరు కంపెనీ మాకు త్వరలోనే అనుమతులు వస్తాయని చెప్పుకుంటోంది.  గతంలో ఒక్క వెంటిలేటర్ తయారీ అనుభవం కూడా లేని ఎస్ఎంటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇలాంటి సమయంలో వెంటిలేటర్ల తయారీ పనిని అప్పగించడం ఏంటో శర్మ గారికే తెలియాలి. ఫినిక్స్ అనే సంస్థకు ఇంక్యుబేటర్ల తయారీలో మాత్రమె అనుభవం ఉంది. ఇంతవరకూ ఈ పూర్తి స్థాయిలో వెంటిలేటర్లు తయారు చెయ్యలేదు.

గ్రీన్ ఓషన్ రీసెర్చ్ లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇన్ఫ్రారెడ్ ధర్మల్ గన్స్ తయారీ కాంట్రాక్ట్ తీసుకుంది. ఈ సంస్థకు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కేవలం అసెంబ్లింగ్ పనులకే అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఇంత అత్యవసర పరిస్తితుల్లో ధర్మల్ గన్స్ ను చెన్నైలో ఉన్న ఈ సంస్థ నుంచే నేరుగా కొనుగోలు చేస్తే సమయం ఆదా అవుతుంది. కానీ జితేంద్ర శర్మ, ఈ అత్యవసర సమయం లో,  ఇక్కడ మాత్రం తయారు చేయించాలని చూడడం ప్రజల ప్రాణాలతో చేలగాటమాడటమేనని ప్రభుత్వం లోని కీలకమైన అధికారులే అంటున్నారు.  ఒక పక్కన పరిశ్రమల శాఖ మంత్రి ఏప్రిల్ 15నాటికి పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ కిట్స్ అందుబాటులోకి వస్తున్నాయని ప్రకటనలిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం కరోనా కిట్స్ కోసం కేంద్రాన్ని అభ్యర్దిస్తున్నారు. ఈ పరస్పర విరుద్ద ప్రకటనల మర్మం ఎంతో ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. అసలు మెడ్ టెక్ జోన్ లో తయారీ సామర్ధ్యమున్న కంపెనీలే లేకపోవడం కొసమెరుపు.