ఎన్నికల్లో పోటీకి మాయావతి దూరం.. 24 ఏళ్ల తరవాత?

 

విపక్ష పార్టీల్లో పీఎం కుర్చీ రేసులో ఉన్న నేతల లిస్ట్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చునని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఆమె శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాలు ఆమెను పోటీ చేయమని కోరుతున్పప్పటికీ.. స్టార్‌ క్యాంపెయినర్‌గా కేవలం ఒకే స్థానంపై దృష్టి సారించడం సబబు కాదని, దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలనీ ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

ఎస్పీ-బీఎస్పీ పొత్తు నేపథ్యంలో ఎస్పీ తరపున కూడా ఆమె ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్‌ 2న ఒడిశాలోని భువనేశ్వర్‌ నుంచి ఆమె ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారన్నారు. ఎస్పీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ తరపున మాయావతి ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. 24 ఏళ్ల తరవాత ఈ ఇద్దరు నేతలు కలిసి పనిచేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. అప్పట్లో యూపీలో రెండు పార్టీలదే హవా నడిచిన నేపథ్యంలో ఈ ఇరువురు నేతల మధ్య సత్సంబంధాలు లేవు. కానీ అనూహ్యంగా రెండు పార్టీలను పక్కకు నెట్టి బీజేపీ అధికారం చేజిక్కించుకోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఎలాగైనా బీజేపీను గద్దెదించాలన్న లక్ష్యంతో గోరఖ్‌పూర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఇరుపార్టీలు ఏకమయ్యాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ములాయం సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి నియోజకవర్గంలో ఆయన తరపున మాయావతి ప్రచారం నిర్వహించబోతున్నారు. ఏప్రిల్‌ 19వ తేదీన ఎస్పీ మెయిన్‌పురిలో నిర్వహించనున్న సభకు హాజరుకావాలని మాయావతి నిర్ణయించారు.