తిట్టినా తుడిచేసుకోవడమేనా? ఆంద్రుల ఆత్మగౌరవం అంతేనా?
Published on: Thu Feb 3, 2022 10:32AM
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, భాష గురించి చర్చ అనవసరం. అది ఆయన విజ్ఞత, వివేచనకు సంబందించిన విషయం.కానీ,ఆయన మాట్లాడుతున్న భాష తెరాస నాయకులకే రుచించడం లేదు. చివరకు, తెరాస రాజ్యసభ సభ్యుడు, కే. కేశవ రావు కూడా, కేసీఆర్ భాషను కాదు భావాన్ని మాత్రమే తీసుకోవాలి అన్నారు,అంటే కేసీఆర్ భాష అభ్యంతరకరంగా , అసభ్యంగా ఉందని ఆయన కూడా భావిస్తున్నారని అనుకోవచ్చును.
సరే, అదలా ఉంటే, కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీలనే కాదు, పొరుగు రాష్ట్రం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని వదిలి పెట్టలేదు. నిజానికి, కేసీఆర్ వైసీపీని, వైసీపీ ప్రభుత్వాన్నే కాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కూడా అవమానించారు. చిత్రం ఏమంటే, కేసీఆర్ తమపై చేసిన ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ధీటుగా స్పందించారు, కానీ, వైసీపీ నాయకులు పెదవి విప్పలేదు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఏపీకి తెలంగాణ సరసన నిలిచే అర్హతే లేదని చులకన చేసి మాట్లాడినా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో చలనం లేదు. వైసీపీలో కదలిక లేదు. అంతే కాదు, గుడివాడ కాసినో వ్యవహరాన్ని, గంజాయి అక్రమ రవాణాకు సంబందించి ఇటీవల వెలుగులోకి వచ్చిన వార్తలను దృషిలో ఉంచుకుని కావచ్చును, ఏపీలో క్లబ్‌లు, గంజాయి వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి అని అర్థం వచ్చే విధంగా కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలుచేశారు. అలాగే, చెప్పీచెప్పకుండానే ఏపీలో ఇళ్ళ నిర్మాణానికి గజానికింత అని (జే’ టాక్స్) వసూలు చేస్తున్నారని, విమర్శలు గుప్పించారు. నిజానికి, తెరాస నాయకులు ఇలా ఏపీని చులకన చేసి మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మరి కొందరు కూడా రాష్ట్రాన్ని అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం అప్పుల మీదనే మనగడ సాగిస్తోందని, అప్పు లేనిదే పూట గడవదని అన్నారు.
అయినా, అప్పుడే కాదు, ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను అవమానించే వ్యాఖ్యలు చేసినా, వైసీపీ నేతలు ఎవరూ కేసీఆర్ వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు. ఖండించక పోవడమే కాదు, రాజ్యాంగాన్ని, రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్’ను అవమన పరిచే విధంగా రాజ్యాంగాన్ని తిరగ రాయాలంటూ కేసీఆర్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను వైసీపీ నేతలు సమర్ధించారు. కేసీఆర్’కు ఆయన భాషలోనే చెప్పాపంటే, ‘సిగ్గు లేకుండా’ జై కొట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, మేథావులు ఆందోళన చేస్తున్నా, అదేమీ పట్టనట్టు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి సమర్ధించారు. కేసీఆర్ మాటల్లో తప్పేమీ లేదని రాజ్యాంగం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు సహేతుకంగానే ఉన్నాయని సజ్జల ప్రకటించారు. కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు సమంజసమేనని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అంటే, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిచినా, రాజ్యాంగాన్ని,రాజ్యాంగ నిర్మాతను అవమానించినా, వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు. కేసీఆర్’తో జగన్ రెడ్డికి ఉన్న ఫెవికాల్ బంధం ఏమిటీ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అలాగే, అటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్’లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినా, ముఖ్యమంత్రి స్పందించరు. చివరకు అన్నీ తెలిసిన, సర్వం తానైన’ సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆ ఒక్కటి నన్ను అడగద్దని తప్పించుకుంటారు. ఆర్థిక మంత్రి బుగ్గన, అవును అన్యాయం జరిగింది.అది మన దురదృష్టం అంటారు. మరో వంక పొరుగు రాష్ట్రం అవమాన పరిచినా, అవహేళన చేసినా, ముఖ్యమంత్రి చిరు నవ్వుతో తుడిచేసుకుంటారు. అందుకే, వైసీపీ ధోరణిని జాగ్రత్తగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినా మా ఆస్తులు,మా కేసులే మాకు మాకు ముఖ్యం, అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యవహార శైలి ఉందని అంటున్నారు.అందుకే ఎన్టీఅర్ నిలబెట్టిన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, జగన్మోహన్ రెడ్డి అటు ఢిల్లీకి ఇటు హైదరబాద్’కు తాకట్టు పెట్టారని పరిశీలకులు అంటున్నారు.


