TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కెసిఆర్ జగన్ అపవిత్ర కలయిక

Published on: Wed May 16, 2012 10:35AM

రాష్ట్రంలో మరో మ్యాచ్ ఫిక్సింగ్ అంకానికి తెర లేచింది. తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు-వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి తాజా మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రధాన సూత్రదారులవుతున్నారు. తెలంగాణా ప్రాంతంలో జగన్ కు గణనీయమైన ప్రజామద్దతు ఉన్నట్లు కెసిఆర్ భావిస్తున్నారు. తమకు వారి మద్దతు కూడా తోడైతే తెలంగాణా ప్రాంతంలో తిరుగుఉండదని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన జగన్ పార్టీకి లోపాయికారికంగా మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే పరకాలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ విజయానికి కెసిఆర్ మార్గాన్ని సులభం చేస్తున్నారన్న కథనాలు వినిపిస్తున్నాయి.

 

తెలంగాణావాద ఓటర్లలో చీలిక తేవడం ద్వారా పరకాలలో కొండా సురేఖ విజయానికి పరోక్షంగా కెసిఆర్ సహకరించబోతున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణావాదులంతా ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాలన్న తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ సలహాను కెసిఆర్ తోసిపుచ్చారు. దీంతో పరకాలలో టి.ఆర్.ఎస్.తో పాటు బిజెపి, టిడిపి కూడా రంగంలో ఉండబోతున్నాయి. వీటికి తోడు విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీకి చెందిన అభ్యర్థి కూడా రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణావాద ఓటర్లలో చీలికరావటం ఖాయం.

 

 

ఫలితంగా కొండా సురేఖ విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయని అంచనావేస్తున్నారు. కొద్ది కాలం క్రితం తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కెసిఆర్ కు పరోక్షంగా జగన్ మద్దతు ప్రకటించారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరూ తెలంగాణా ప్రాంతంలో పోటీ చేయలేడు. అప్పట్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటే టి.ఆర్.ఎస్. అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురై ఉండేవి. కాని కెసిఆర్, జగన్మోహనరెడ్డి మధ్య ఉన్న అవగాహన కారణంగా టి.ఆర్.ఎస్. అభ్యర్థుల విజయం తేలికైంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న అవగాహన కారణంగా పరకాలలో కొండాసురేఖ విజయానికి మార్గం సుగమం చేస్తున్నారు. అయితే వీరిద్దరిది అపవిత్ర, అవకాశవాద కలయిక అని వీరిద్దరూ అధికారంకోసం తెలంగాణా ప్రజలకు ద్రోహం చేస్తున్నారని తెలంగాణాప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.