ఉద్యోగుల్లో చీలిక తెచ్చే కుట్ర!.. చర్చల పేరుతో చిచ్చు!
Published on: Tue Feb 1, 2022 11:09AM
పీఆర్సీ తేనెతెట్టు ఈ రేంజ్లో చుట్టుముడుతుందని ఊహించలేదు జగన్ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులే కదా.. నాలుగు బిస్కెట్లు వేస్తేనో.. కాస్త గట్టిగా బెదిరిస్తేనో.. తోకముడుస్తారని అనుకుంది. కానీ, తామేమీ కట్టప్పలా తాడేపల్లి సింహాసనానికి బానిసలం కాదని.. ప్రభుత్వ ఉద్యోగులు పోరాట యోథులని ప్రభుత్వానికి తెలిసొచ్చేలా సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 7న చలో విజయవాడ.. దండయాత్రకు రెడీ అవుతున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులు విజయవాడలో కదం తొక్కుతారు. ఈ సమాచారం నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న పెద్దలకు అప్పుడే ముచ్చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. ఓవైపు పే స్లిప్లు తయారు చేస్తూనే.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే.. లోలోన ఉద్యోగులను విభజించి.. సమ్మెను నీరుగార్చే కుట్రలకు పాల్పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం తరపున సానుకూల ప్రకటన వచ్చే అవకాశముందంటూ లీకులిస్తూ.. కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులకు చర్చలకు రావాలని లేఖలు పంపిస్తూ.. డబుల్ గేమ్ మొదలుపెట్టేసిందని అంటున్నారు.
సడన్గా చలో విజయవాడ కార్యక్రమానికి ముందు ప్రభుత్వం తరఫున లేఖలు పంపడం.. ఉద్యోగ సంఘాలు సైతం తాము చర్చలకు రెడీ అంటూ మెసేజ్ ఇవ్వడంతో.. అసలు చలో విజయవాడ ఉంటుందా? లేదా? అనే సందిగ్ధంలో ఉద్యోగులు పడిపోయారు. చలో విజయవాడను నీరుగార్చడానికి ప్రభుత్వం పన్నిన వ్యూహంగా అనుమానిస్తున్నారు.
ఇప్పటికే ఆర్టీసీలో ఓ యూనియన్ సమ్మె వద్దని చెప్పిందని, మరో డిపార్ట్ మెంట్ లో మరో యూనియన్ తాము సమ్మెకు సిద్ధంగా లేమని చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ప్రభుత్వ అనుకూల మీడియా, వారికి చెందిన సోషల్ మీడియాలోనే ఈ వార్తలు హైలెట్ అవుతున్నాయి. కనీసం ఈనెల 7న సమ్మె మొదలయ్యే వరకైనా ఉద్యోగ సంఘాలు ఏకతాటిపై ఉంటాయా..? లేక ప్రభుత్వం ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చే ప్రకటన ఏదైనా విడుదల చేస్తుందా..? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఉద్యోగులంతా ఏకతాటిపై ఉంటామని చెబుతున్నారు, మరి ప్రభుత్వ చర్చలతో ఉద్యోగ సంఘాల్లో చీలిక వస్తే మాత్రం పరిస్థితి మరోలా మారిపోతుంది.
మరోవైపు, చలో విజయవాడతో పాటు ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి ప్రారంభమయ్యే సమ్మెపై స్టీరింగ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడంలేదనే విషయాలపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందనే దానిపై చర్చించారు. ఈ వాదనలు వ్యతిరేకించేలా వాట్సాప్ మెసేజ్ల ద్వారా కాకుండా.. లిఖితపూర్వకంగా చర్చలకు ఆహ్వానిస్తే.. గతంలో తాము పెట్టిన మూడు డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించి రావాలని భావిస్తున్నట్లు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు.


