లెబనాన్ రాజధాని లో భారీ పేలుడు, 78 మంది మృతి.. వేలాది మందికి గాయాలు

లెబనాన్ రాజధాని బీరుట్ ‌లో జరిగిన భారీ పేలుడులో 78 మంది చనిపోగా 4000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి కెమెరాకు చిక్కిన ఒక వీడియోను గమనిస్తే బ్లాస్ట్ ఏ స్థాయిలో సంభవించిందో అర్థమయిపోతుంది. చాల భవనాలు కూలిపోయి శిథిలాల కింద ఇంకా ప్రజలు చిక్కుకొని ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బీరూట్ నగరంతా గాజు పెంకులతో నిండిపోయింది. ప్రజల ఆర్తనాదాలు, హాహాకారాలతో భయానకమైన వాతావరణం అక్కడ దర్శనమిస్తోంది.

 

తొలుత బాంబు బ్లాస్టులుగా భావించినప్పటికీ ఇది బాంబు బ్లాస్టు కాదని తరువాత జరిగిన విచారణలో తేలింది. లెబనాన్ రాజధాని బీరుట్ ఓడరేవులోని ఓ గోడౌన్ ‌లో ఆరేళ్లుగా అత్యంత శక్తిమంతమైన పేలుడు పదార్ధమైన అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ చేసినట్లు తాజాగా అధికారులు చెబుతున్నారు. మొత్తం 2750 టన్నుల అనుమతిలేని అమ్మోనియం నైట్రేట్ నిల్వ చేశారని ఆ దేశ అధ్యక్షుడు మైకెల్ ఆన్ ట్వీట్ చేశారు. ఆరు సంవత్సరాలుగా ఇంత భారీ స్థాయిలో అమ్మోనియం నైట్రేట్ ని ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా నిల్వ చేయడం పై లెబనాన్ ప్రధాని తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తూ దీని వెనుక ఎంతటివారున్నా వదిలేది లేదు అని తెలిపారు. దీనికి బాధ్యులైనవారికి అత్యంత కఠిన శిక్షలు పడతాయని లెబనాన్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ కూడా తెలిపింది.

 

తాజాగా ఈ పేలుడులో గాయపడిన క్షతగాత్రులతో బీరూట్ రాజధాని ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. అత్యవసరంగా సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం దాదాపుగా 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది. పేలుడు శబ్దాన్ని వందల కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ దేశంలో కూడా వినిపించిందంటే పేలుడు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.