TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

Published on: Thu Apr 2, 2026 12:50PM

తూర్పు ఇండోనేషియాలో గురువారం (ఏప్రిల్ 2)  ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.4గా నమోదైంది.  ఈ భూకంపం కారణంగా సునామీ సంభవించే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.  భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలో బలమైన సునామీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. 

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.48 గంటల సమయంలో    టెర్నాటే ద్వీపానికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. దీని ప్రభావంతో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉందని  సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

భూకంపం కారణంగా నార్త్ సులవేసి ప్రావిన్స్‌లోని మనాడో నగరంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూమి కంపించడంతో నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం ఏదీ లేదు.  సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.