సూపర్ మార్కెట్ కింద 200 అస్థిపంజరాలు

 

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఒక సూపర్ మార్కెట్ కింద ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 200 అస్థిపంజరాలు కనిపించి జనాలు కెవ్వుమని కేక పెట్టేలా చేశాయి. సూపర్ మార్కెట్ విస్తరణ కోసం తవ్వకాలు జరుగుతూ వుండగా వందలాది మానవ అస్థిపంజరాలు బయటపడ్డాయి. లెక్క వేస్తే రెండు వందలు దాటాయి. దాంతో ఎవరో వీళ్ళందర్నీ చంపేసి సూపర్ మార్కె్ట్ కింద పాతిపెట్టారంటూ వదంతులు కూడా వ్యాపించాయి. అయితే సమాచారం అందుకున్న పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించి అస్థిపంజరాల గుట్టు విప్పారు. 13వ శతాబ్దంలో ఇదే ప్రదేశంలో ఒక ఆస్పత్రి వుండేది. ఆ సమయంలో అంటువ్యాధులు విపరీతంగా ప్రబలుతూ వుండేవి. ఆ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయిన రెండు వందల మందికి పైగా మృతులను ఆస్పత్రి సమీపంలోని శ్మశానంలో ఖననం చేశారు. కాలక్రమేణా నగరం విస్తరించడంతో శ్మశానం మీద సూపర్ మార్కెట్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు కాస్తంత లోతుగా తవ్వడంతో ఈ అస్థిపంజరాలు బయటపడి అందర్నీ చరిత్రలోకి తీసుకెళ్ళాయి.