ఎస్సై ఓవర్ యాక్షన్.. మాస్క్ లేదని పోలీస్ జులూం
Published on: Fri Mar 11, 2022 10:17AM
ఆ పొలీస్ అధికారి ఎక్కడ పనిచేసినా వివాదాలే.. సామాన్యులపై తన ప్రతాపం చూపించి రచ్చ రచ్చ చేసేస్తాడు. ఆపైన ఉన్నతాధికారుల ఆగ్రహానికి కూడా గురౌతూనే ఉంటాడు. మళ్లీ పెద్దోళ్లకు సలాం కొట్టి పోస్టింగ్ పడతాడు. ఇది ఆ ఎస్ఐకు నిత్యకృత్యంగా మారింది . వివాదాలకు కేరాఫ్ నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎస్సై వెంకటరమణ ప్రవర్తన మరోసారి వివాదాస్పదంగా మారింది.. వాహనదారుడ్ని ఆయన కాలర్ పట్టుకుని లాక్కెళ్లాడు.
మాస్క్ పెట్టుకోలేదనే కారణంగా ఆ వాహదారుడ్ని ఎస్సై వెంకటరమణ దారుణంగా లాక్కెళ్లాడు. రాజకీయ నాయకులు మాస్క్ లేకుండా వేల మందితో మీటింగ్ లు పెడుతుంటే దగ్గరుండి సెల్యూట్ కొట్టిన ఎస్సై వెంకటరమణకు సామాన్యుడు మాస్క్ పెట్టుకోలేదని ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాట్సాప్ గ్రూపులో ఈ వీడియో హల్చల్ చేస్తుండడంతో దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఎస్సై వెంకటరమణపై మరోసారి చర్యలు ఉంటాయో లేదో.. చూడాల్సి ఉంది.


