TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్లి కానుక పేలిపోయింది.. పెళ్లి కుమారుడి చేయి పోయింది!

Published on: Thu May 19, 2022 6:40AM

అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కొత్త జంట ఆనందంగా తమకు వచ్చిన పెళ్లి కానుకలు చూసుకుంటున్నారు. అంతా సంతోషకరమైన వాతావరణం. ఇంతలో పెద్ద పేలుడు.. ఇంకేముంది నూతన వధూవరులిరువురూ తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లింట్లో పేలుడేమిటనుకుంటున్నారా.. పెళ్లి కానుక ఒకటి పెద్ద శబ్దంతో పేలిపోయింది.

ఇంతకీ అలా పేలిపోయింది ఒక బ్యాటరీ బొమ్మ. చూడగానే కొత్త దంపతులకు అది నచ్చేసింది. వెంటనే బ్యాటరీ రీ చార్జ్ పెట్టారు. ఇలా పెట్టారో లేదో అలా పేలిపోయింది. దీంతో అంత వరకూ సంతోషంగా ఉన్న పెళ్లి ఇల్లు ఒక్క సారిగా విషాదంలో మునిగిపోయింది. వధూవరులను ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.

ఎవరికీ ప్రాణాపాయం లేదు కానీ పెళ్లి కొడుకు చేతిని మణికట్టు వరకూ తొలగించాల్సి వచ్చింది. పెళ్లి కూతురూ గాయపడింది. ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది. పెళ్లి ఈ నెల 12న జరిగింది. పేలుడు ఘటన పెళ్లి కానుకలను వధూవరులిరువురూ కలిసి 17న చూసుకుంటుండగా జరిగింది. 
ఇంతకీ ఆ పెళ్లి కానుక ఇచ్చిందెవరయ్యా అని ఆరా తీస్తే పెళ్లి కూతురి అక్క మాజీ ప్రియుడు. తనతో విడిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపాన్ని ఇలా తీర్చుకుని ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు దర్యాప్తులో తేలుతాయి. కానీ పెళ్లింట మాత్రం పెళ్లి కానుక విషాదాన్ని నింపింది.