ఎమ్మెల్యే హికాకా విడుదలపై బెట్టు వీడిన మావోలు
Published on: Mon Apr 16, 2012 10:45AM
మావోయిస్టుల చెరలో బందీగా ఉన్నఎమ్మెల్యే జినా హికాకాను విడుదల చేసేందుకు మావోయిస్టులు బుధవారం వరకు డెడ్‌లైన్‌ను పొడిగించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ఏప్రిల్ 18వరకు తుది గడువు అని మావోయిస్టులు ప్రకటిం చారు. మావోయిస్టుల ఆంధ్రా-ఒడిషా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీ (ఎఒబిఎస్‌జెడ్‌సి) నాయకుడు ఒకరు, మావోయిస్టుల కేసులను వాదిస్తోన్న కోరాపుట్‌కు చెందిన న్యాయవాది నిహార్ రంజన్ పట్నాయక్‌కు ఈ విషయమై ఒక సందేశాన్ని పంపిం చారు. ఏప్రిల్18 సాయంత్రం 5గంటలకు తాము కోరుతున్న 29మంది మావోయిస్టుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఖైదీలు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వ సూచనను తిరస్కరిస్తూ, అవన్నీ ప్రభుత్వమే చూసుకోవాలని, బేషరతుగా ఖైదీలను తమకు అప్పగించాలని స్పష్టం చేశారు. కాగా, విడుదల పొందాల్సిన మావోయిస్టుల తరఫున బెయిల్ పిటిషన్లు దాఖలు చేయించేలా వారి న్యాయవాదులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని ఒడిశా హోంశాఖ కార్యదర్శి బెహరా చెప్పారు.


