ఇసుక మాఫియా నేతలకు మావోయిస్టుల హెచ్చరిక

 

మన ప్రజాప్రతినిధులు ప్రజాసేవతో బాటు రకరకాల వ్యాపారాలు చేసుకొనే వెసులుబాటు ఉంది. కేవలం ప్రజాసేవకోసమే కట్టుబడినవారిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును. అటువంటి వారిని ప్రజలు దేవుళ్ళని భావిస్తే, అవకాశం ఉన్నపుడు కూడా రెండు చేతులా సంపాదించుకోవడం చేతకాని దద్దమ్మలని వారి సహచరులు దృడంగా నమ్ముతారు. ఈ రోజు మావోయిష్టుల కళ్ళు ఇసుక మాఫియాలో మునిగి తేలుతున్న మన ప్రజాప్రతినిధులపై పడింది. మావోయిస్టుల అధికార ప్రతినిధి జగన్ సంతకంతో ఉన్న ఒక లేఖ మీడియాకు చేరింది. అందులో ప్రజాప్రనిధులయిన అనేకమంది శాసనసభ్యులు, మంత్రులు, యంపీలు ఇసుక మాఫియాగా తయారయ్యారని వారు ఇప్పటికయినా తమ ఇసుక మాఫియా వ్యాపారాలను కట్టి బెట్టకపోయినట్లయితే ప్రజల చేతులో వారికి దండన తప్పదని హెచ్చరిక జారీ చేసారు. ఆ లేఖలో కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణ, మంత్రి శ్రీధర్ బాబు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు వనమా వెనకటేశ్వర రావు, భద్రాచలం శాసనసభ్యురాలు కుంజ సత్యవతి, బాలసాని లక్ష్మి నారాయణ, కరీం నగర్ కు చెందిన కాంట్రాక్టర్ జగ్గారెడ్డిల పేరిట హెచ్చరిక జారీ అయింది.