TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు

Published on: Tue May 26, 2026 5:01PM

 

మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి ఆయన భార్య మేదర దానమ్మ పోలీసుల ఎదుట లొంగిపోయారని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ.25 లక్షల నగదు, ప్రోత్సహకాలు, ఇతర సౌకర్యాలు కల్పించినట్లు డీజీపీ తెలిపారు. 

దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం క్షీణిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని  పోలీస్ బాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 47 మంది కీలక మావోయిస్టు నేతలు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వీరిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 15 మంది, జార్ఖండ్‌కు 13 మంది, ఒడిశాకు 15 మంది, తెలంగాణకు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ఒకరు ఉన్నారని వివరించారు.

2024 నుంచి ఇప్పటి వరకు మొత్తం 822 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారిలో 334 మంది ఆయుధాలతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారని డీజీపీ వెల్లడించారు. తెలంగాణలో లొంగిపోయిన ఒడిశా మావోయిస్టులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని చెప్పారు.

తెలంగాణకు చెందిన మావోయిస్టులను త్వరలో వారి ప్రాంతాలకు వెళ్లి స్వయంగా కలుస్తానని డీజీపీ తెలిపారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన సెంట్రల్ కమిటీ సభ్యుడు ముప్పాల లక్షణరావు అలియాస్ గణపతి ప్రజా జీవితంలోకి రావాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. లొంగిపోతే ప్రభుత్వం తరఫున అన్ని రకాల సదుపాయాలు, పునరావాస ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఇంకా అజ్ఞాతంలో ఉన్న గణపతి, జాడే రత్న బాయి, వార్త శేఖర్ వంటి నేతలు కూడా ప్రజా జీవితంలోకి రావాలని డీజీపీ కోరారు. ఈ సందర్భంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జార్ఖండ్, తెలంగాణ తదితర ప్రాంతాల్లో సాయుధ పోరాటంలో తీవ్ర నష్టాలు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆ పోరాటాన్ని కొనసాగించడం కష్టంగా మారిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశాల వల్లే తాము ప్రజా జీవితంలోకి వచ్చామని నరహరి తెలిపారు. జార్ఖండ్ పీబీ సభ్యుల అనుమతితోనే బయటకు వచ్చామని, ఇకపై ప్రజల హక్కుల సాధన చట్టపరంగానే జరగాలని భావిస్తున్నామని చెప్పారు. గణపతి కూడా ప్రజా జీవితంలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.