మూసీ నది వొడ్డున మావోయిస్టుల బుల్లెట్లు?
Published on: Tue Jun 26, 2012 5:55PM
గతంలో ఒకసారి నాటు తుపాకీ దొరికింది. ఇప్పుడేమో ఏకంగా 119 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అదీ నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం రాంచంద్రాపురంలోని మూసీనది ఒడ్డున. ఈ ఒడ్డున వెదికిన పోలీసులకు 119 బుల్లెట్లు లభ్యమయ్యాయి. మరపడవలో లభ్యమైన ఈ బుల్లెట్లును స్వాధీనపరుచుకున్న పోలీసులు ఇది నక్సలైట్ల చర్య అని భావిస్తున్నారు. మావోయిస్టులే ఈ బుల్లెట్లు దాచి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.
గతంలో ఇదే ప్రాంతంలో నాటుతుపాకీ లభ్యమవటం కూడా వీరి అనుమానాన్ని బలపరుస్తోంది. అయితే ఖచ్చితమైన ఆధారాలు సేకరించాలని పోలీసులు పట్టుదలగా వెదుకులాట కొనసాగిస్తున్నారు. మావోల ప్రాబల్యమున్న ఈ నల్గొండ జిల్లాలో పోలీసులు వారిని వెదుకటం సహజం. అలానే మావోల డంప్లపై కూడా పోలీసులు గట్టి దృష్టి సారించారు. అందువల్ల ఎక్కడ ఏ చిన్న ఆధారం దొరికినా నక్సల్స్తో ఢీ కొనేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఉన్న ఈ యుద్ధవాతావరణం మావోప్రాబల్యమున్న ప్రాంతాల్లో గ్రామీణులను, గిరిజనులను వణుకు పుట్టిస్తోంది. ప్రత్యేకించి ఈ యుద్దంలో ఎక్కువ భాగం తామే దెబ్బతింటున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా మూసీనది ఒడ్డున దొరికిన ఆధారాలను బట్టి పోలీసులు విచారణ పూర్తి చేసి ఆ పరిసర ప్రాంత వాసులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.


