TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భయం... భయం..

Published on: Thu Aug 23, 2012 2:45PM

పిల్లలకు పరీక్షలంటే భయం... ఆటగాళ్ళకు ఛాంపియన్స్‌తో ఆడే సమయంలో గెలుస్తామోలేదో నన్న భయం... ఉద్యోగికి అధికారి భయం... అవినీతిపరులకు అరెస్టుల భయం...కాని అన్ని భయాలకు మించినది.. అందరికి వచ్చే భయం... అనారోగ్య భయం.. ప్రస్తుతం మన్యప్రాంతంలో ఉన్నదదే. ప్రజలకు ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలియక పల్లెలు, పట్టణ ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రంపై రోగాలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా మన్యం ప్రజలకు విషజ్వరాలతో సరైన చికిత్సకు సైతం నోచుకోలేక అల్పాయుష్కులవుతు న్నారు. వరంగల్‌ జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల్లో ప్రజలు వీటిబారిన పడుతున్నారు. మలేరియా, డెంగ్యూ..ఇలా విషజ్వరాలతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. రాష్ట్రంలో పలు ఆసుపత్రుల్లో డాక్లర్ల పోస్టులు ఖాళీగా ఉంటే డాక్టర్లున్న మరెన్నో చోట్ల కనీస సౌకర్యాలుకూడా లేవు. రాష్ట్రంలోని 10 బోధనాసుపత్రులుకు, 17 జిల్లా ఆసుపత్రులకు, 1580 పిహెచ్‌పిలకు, ఏరియా ఆసుపత్రులకు ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుండే మందులు సరఫరా అవుతుంటాయి. వాస్తవానికి 644 రకాల మందులను సరఫరాచేయాల్సి ఉండగా, కేవలం ప్రస్తుతం 224 మందులనే సరఫరా చేస్తున్నారు.

 

మిగిలిన మందులను కొనుక్కోమంటూ డిఎంహెచ్‌ఓలకు నిధులు కేటాయిస్తున్నారు. అయితే డిఎంహెచ్‌ఒ నిధులు ఖర్చుచేయకుండా చాలా జాగ్రత్త చేస్తోంది. ఇప్పటివరకు దాదాపుగా రూ. 44కోట్లు డిఎంహెచ్‌ఓల దగ్గర మూలుగుతున్నాయంటే అది ఎంత భద్రంగా కాపాడుతోందో ఆలోచించవచ్చు.! మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు సోకినప్పుడు వాటినుండి రోగులను కాపాడేందుకు సెలైన్‌ బాటిళ్లు ఎంతో అవసరం. వాటికి సైతం తీవ్ర కొరత ఏర్పడిరది. అలాగే వైద్య సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టుల పోస్టులు లేకపోయినా.. కనీసం వైద్యం అందించే నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయడంలో ఎప్పటిలాగే నాన్చుడుధోరణి అవలంభిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యమన్నది ఎండమావే. కాస్తోకూస్తో గ్రామీణ ప్రజలకు సేవచేయాలని తలంపు వుండి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యసిబ్బందికి తగిన ప్రోత్సహకాలు లేవు. ఎంతోమంది అధికారులు మొదలు మంత్రుల వరకు కూడా వారి మాటలు ప్రజారోగ్యమే మా ధ్యేయం అన్నట్లుగా ఉంటాయి కాని అమలువిషయం వచ్చేసరికి అడుగు కూడా ముందుకు పడనివ్వరు. అయినా.. మనపిచ్చిగాని.. రాజధానిలోను, ప్రముఖ పట్టణాల్లోని ఆసుపత్రుల్లోనే ఎంతోమంది పిల్లలు మరణిస్తుంటే ఎక్కడో మన్యంలో మరణఘోష వారికి ఏం వినపడుతుంది.? వ్యాధులు ప్రారంభదశలో ఉన్నప్పుడే అప్రమత్తమైతే మిగిలిన ప్రాంతాల్లో ప్రజలు వాటి బారిన పడకుండా ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత పరామర్శలు గుర్తుకు వచ్చి ఏం ప్రయోజనం? రోగాలబారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఏడాది లక్షలు ఖర్చుపెట్టాం! లక్ష్యం సాధించాం! అంటుంటారు. వాస్తవంలో అందుకు భిన్నంగా ఉంటోంది పరిస్థితి. ఇప్పటికైనా మేలుకుంటే ప్రజలకు ఎంతోమేలు..! ప్రభుత్వ చర్యల గురించి ప్రస్తావిస్తే మాత్రం చేస్తుందా.. ఎక్కడో కొద్దిగా ఆశైతే ఉన్నా.. సామాన్యుడికి ‘నేతిబీరలో నెయ్యిలాంటిదే’నన్న సామెత గుర్తుకువస్తోంది!