టీఆర్ఎస్ లో పోటీ.. కాంగ్రెస్ కి కలిసొచ్చింది!!

ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ ఏది ఏమైనా పోటీ చేయడమే ముఖ్యం. ఇది మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సంబంధించి వివిధ పార్టీల నేతల్లో నెలకొన్న అభిప్రాయం. దీంతో అభ్యర్థిత్వం పై పార్టీ నాయకత్వం నుంచి హామీ లేకపోయినా నామినేషన్ వేశారు. సొంత పార్టీ నుంచి టిక్కెట్ దక్కదని తెలియడంతో కండువా మార్చేశారు. మరో పార్టీ నుంచి కూడా నామషన్ దాఖలు చేశారు. చివరికి ఏ పార్టీ టిక్కెట్ దక్కితే ఆ పార్టీ బి ఫారాన్ని సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఒక్కొక్కరు రెండు మూడు నామినేషన్లు కూడా వేయడమే కాక రాత్రి కి రాత్రి పార్టీ కూడా మారుతున్నారు. పరిషత్ ఎన్నికలను స్వీప్ చేసిన అధికార టీఆర్ఎస్ఐ ఈ తలనొప్పులను ఎక్కువగా ఎదుర్కొంటోంది. పలుచోట్ల కాంగ్రెస్ కు సైతం ఈ సమస్య ఎదురవుతుంది. టీఆర్ఎస్ నుంచి గోడదూకే వారు ఎక్కువగా కాంగ్రెస్ బీజేపీలనే ఎంచుకుంటున్నారు. అది కుదరకపోతే స్వతంత్ర అభ్యర్థు లుగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దపడుతున్నారు.

కామారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కు చెందిన ఎల్లంకి శ్రీనివాస్ కు ఆ పార్టీ టిక్కెట్ దక్కక పోవడంతో కాంగ్రెస్ లో చేరారు. గురువారం టీఆర్ ఎస్ తరుపున వార్డుకు నామినేషన్ వేసిన శ్రీనివాస్ టిక్కెట్ రావడం లేదని తెలిసి శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న వెంటనే కాంగ్రెస్ తరఫున టికెట్ పొంది మళ్లీ నామినేషన్ వేశారు. ఎల్లారెడ్డి మునిసిపాలిటీలో టీఆర్ఎస్ టికెట్లు దక్కని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎంపీటీసీ సభ్యులు కూడా కాంగ్రెస్ లో చేరారు. వీరంతా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు కావడంతో వీరికి టికెట్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ నిరాకరించినట్లు దీంతో వీరు పార్టీ మారినట్టు చెబుతున్నారు.మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ టీఆర్ఎస్ నేత ఉప్పలయ్య కాంగ్రెస్ లో చేరగా ఆయనను మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.ఇలా నేతలు పార్టీలు మారడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల బుజ్జగింపుల పదునుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం దక్కకపోయినా నామినేటెడ్ పదవులు ఇతర అవకాశాల్ని ఎరగా చూపున్నారు నేతలు.