కాంగ్రెస్ గూటికి పలువురు తెరాస కీలక నేతలు..!!

 

ఎన్నికల సమయం దగ్గరపడడంతో తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గత ఎన్నికల అనంతరం.. ఈ నాలుగున్నరేళ్లలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలలోని పలువురు సీనియర్ నాయకులు తెరాస గూటికి చేరారు. తెరాస ఒకరకంగా నాయకులతో కళకళలాడింది. అయితే ఇప్పుడు తెరాసకు ట్విస్ట్ ఇచ్చే పనిలో బిజీగా ఉంది కాంగ్రెస్. కేసీఆర్ ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. అంతేనా.. ఒకేసారి 105 అభ్యర్థులను ప్రకటించి దూకుడు పెంచారు. అయితే అప్పటి నుంచి కాంగ్రెస్ తెరాస దూకుడికి కళ్లెం వేసే పని మొదలు పెట్టింది. ఓ వైపు టీడీపీ, టీజెఎస్, సిపిఐ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి.. గెలుపై ధీమాగా ఉన్న తెరాసకు షాక్ ఇస్తూ నువ్వా నేనా అన్నట్టుగా పోటీకి సిద్ధమైంది. దీనికి తోడు తెరాసకి మరో చిక్కొచ్చిపడింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుండి భారీగా నాయకులను చేర్చుకున్నారు. దీంతో అన్ని స్థానాల నుండి ఆశావహులు ఎక్కువయ్యారు. అందరికి టిక్కెట్ కేటాయించడం కుదరదు. దీంతో అసంతృప్తిలో ఉన్న నేతలు కొందరు అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడితే.. మరికొందరు ఏకంగా పార్టీనే వీడుతున్నారు. ఇది కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశం. ఇప్పుడు కాంగ్రెస్ తెరాసలోని అసంతృప్తిని తమకి అనుకూలంగా మార్చుకొనే పనిలో బిజీగా ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ బలంగా అయితే ఉంది కానీ ఇప్పట్లో అధికారం పొందడం కష్టమనే అభిప్రాయం మొన్నటివరకు ఉండేది. కానీ ఎప్పుడైతే ముందస్తుకు తెర లేచిందో అప్పటి నుంచి కాంగ్రెస్ కి మంచిరోజులు మొదలయ్యాయి. నాయకులు అంతగా లేకున్నా కేడర్ బలంగా ఉన్న టీడీపీ మహాకూటమితో దగ్గరైంది. దీంతో అధికారం దక్కుతుందనే ఆశ కాంగ్రెస్ లో మొదలైంది. దీనికి తోడు తెరాసలో టిక్కెట్ కోసం అసంతృప్తి సెగలు. ఇంకేముంది కాంగ్రెస్ 'వస్తుందిలే అధికారం ముందు ముందునా' అని పాడుకుంటుంది. అంతేకాదు తెరాసలోని అసంతృప్తి నేతలకు సైలెంట్ గా గేలం వేస్తుందట. తెరాస లోని ఓ ఐదుగురు కీలక నేతలు త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారట. ఈ నెల 20న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వ‌స్తున్న నేప‌థ్యంలో.. ఆయ‌న స‌మ‌క్షంలోనే ఈ ప్ర‌ముఖుల చేరిక‌లు ఉంటాయని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేల ఇది తెరాసకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

మరోవైపు ఈ చేరికలతో కాంగ్రెస్ కి కూడా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ కూటమి సీట్ల సర్దుబాటుతో సతమతమవుతోంది. కూటమిలోని పార్టీలకు సంతృప్తికరంగా సీట్లు కేటాయించాలి. అదేవిధంగా కూటమిలోని పార్టీలకు సీట్లు కేటాయించిన స్థానాల్లో.. తమ పార్టీ నేతలను బుజ్జగించాలి. మరి ఇలాంటి సమయంలో తెరాస నుండి ఐదుగురు కీలక నేతలు చేరితే.. వారికి ఖచ్చితంగా సీట్లు కేటాయించాలి. దీంతో సొంత పార్టీ నేతలకో లేక కూటమిలోని పార్టీల సీట్లకో గండిపడుతోంది. దీంతో కాంగ్రెస్ లో లేదా కూటమిలో అసంతృప్తి సెగ ఏర్పడే ప్రమాదం ఉంది. మరి కాంగ్రెస్ నిజంగానే తెరాసలోని కీలక నేతలకు గేలం వేసిందా? ఒకవేళ వారు నిజంగానే పార్టీలో చేరితే అసంతృప్తి ఏర్పడకుండా కాంగ్రెస్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది? ఇలాంటి తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.