వైసీపీ మాస్టర్ ప్లాన్.. ఉప ఎన్నికలకు సై!!

 

వైసిపి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి ప్రతిపక్షం టిడిపిలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది గోడ దూకుతారు అనే చర్చ జరుగుతూనే ఉంది. మాజీలుగా ఉన్నవాళ్లు టిడిపిని వీడడానికి ఎలాంటి ఇబ్బందులూ ఆటంకాలు ఉండవు. కానీ ఎమ్మెల్యే గానో ఎంపీగానో కొనసాగుతున్న వారు పార్టీ మారాలంటేనే సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గతంలో మాదిరి అయితే ఈపాటికే పెద్ద ఎత్తున పార్టీలు మారే వ్యవహారం రసకందాయంలో పడేదేమో. అయితే పార్టీ మారాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తీరాల్సిందేనని స్వీయ నిబంధన పెట్టుకున్న క్రమంలో వైసీపీలోకి ఆశించిన స్థాయిలో టిడిపి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపిలు వెళ్ళలేదనే చెప్పాలి. ఇదే సందర్భంలో వైసిపి నేతలు సదరు టిడిపి ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారో వారితో మాత్రం వైసీపీ పెద్దలు  సన్నిహిత్యం లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అవసరమైన సమయంలో వీలు చూసుకుని పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ అందాక ఒక్కొక్కరినీ తెరమీదకు తెచ్చేలా వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అప్పటి వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకుండా మాజీలపై ఫోకస్ పెట్టి వరసలపై దృష్టి సారించే దిశగా వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. 

ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే వంశీని వెంటబెట్టుకొని మంత్రులు నాని ద్వయం సీఎంను కలవడం ద్వారా వరస ఎపిసోడ్ కు తెరలేపినట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో నెమ్మదిగా తమతో టచ్ లో ఉన్న ఇంకొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఇదే బాట పట్టించే దిశగా పావులు కదిపేందుకు వైసీపీ రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉంది. గంటా కూడా పార్టీ కార్యకలాపాలలో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే భావన అటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్న క్రమంలో గంటా రూట్ బిజెపినా లేక వైసిపినా అనే చర్చ జరుగుతున్నప్పటికీ ఉత్తరాంధ్ర వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే వైసిపికి చెందిన ఓ పెద్దాయనతో గంటా మాట్లాడుకోవలసిన అంశాలన్నీ మాట్లాడేశారని అంటున్నారు. ఈ క్రమంలో వంశీ ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చాక గంట కూడా ఇదే తరహాలో తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

ఇక వీరిద్దరే కాకుండా ఇంకొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహాలో తెర మీదకు తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.  టిడిపిలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు కొందరు చాప కింద నీరులా వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో బలంగా జరుగుతోంది. ప్రస్తుతం టిడిపి అధినాయకత్వం మీద అసంతృప్తి, చంద్రబాబు వారసుడు లోకేష్ పై అపనమ్మకం ఉన్న వారిని గుర్తించే పనిలో సదరు టిడిపి నేతలు సీరియస్ గానే నిఘా పెట్టారని వైసీపీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. 

హైదరాబాద్ కేంద్రంగా సదరు టిడిపి నేతలు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కీలకంగా ఉన్న వారిని ఒక్కొక్కరిగా పిలిపించుకుని మాట్లాడుతూ పార్టీలో పరిస్థితేంటి ఇలాగే ఉంటే భవిష్యత్తు రాజకీయం ఎలా అనే అంశాల పై వివిధ స్థాయిల్లోని కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పుకారులు కూడా వెల్లడవుతున్నాయి . అయితే ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా జరగాలంటే హైదరాబాద్ కేంద్రంగానే మొత్తం వ్యవహారం నడపాలని నిర్ణయించుకుని ఉమ్మడి రాజధాని కేంద్రంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మంత్రాంగం కనుక ఫలిస్తే టిడిపి నుంచి భారీ స్థాయిలో వలసలు ఉండే అవకాశం ఉందటున్నారు వైసీపీ వర్గాలు. ఇదంతా జరిగితే ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. 

అధికారంలోకి వచ్చి నిండా అయిదు నెలలు కాకుండా భారీ స్థాయిలో వ్యతిరేకత ప్రస్తుత ప్రభుత్వం పై గూడుకట్టుకొని పోయిందనే ప్రచారం ప్రతిపక్షం పెద్దఎత్తున చేస్తోంది. ప్రతిపక్ష ప్రచారానికి చెక్ చెప్పాలంటే ఉప ఎన్నిక ద్వారానే సమాధానం చెప్పొచ్చు అనేది కొందరి వైసిపి నేతల వ్యూహంగా కనిపిస్తోంది. పనిలో పనిగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది కాబట్టి ఇదే ఊపులో తమతో టచ్ లో ఉన్న ఇంకొందరు టిడిపి ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తే అన్ని నియోజక వర్గాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరిగే విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం అధికార పక్ష శ్రేణుల్లో కనిపిస్తుంది. ప్రభుత్వ పని తీరు మీద రిఫరెండం అటు ఉప ఎన్నికలకు వెళ్లి గెలిచి సత్తా చాటాలని కొందరు సూచిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పార్టీ పెద్దల వద్ద నిర్ణయం జరగాల్సి ఉంది. ఏది ఏమైనా ఏపి టిడిపిలో వచ్చే రెండు మూడు నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ వైసీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.ఇక ఈ రెండు మూడు నెలల్లో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి.