TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ నుంచి దేశంలోకి వలసల వరద

Published on: Thu Jun 9, 2022 12:15PM

గేట్లెత్తేయగానే వరద గోదారి సముద్రంలో కలిసేందుకు ఉరుకులెత్తి ఉప్పొంగి పారుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల వరద అలాగే వెల్లువెత్తుతుందా అంటే  పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ట వేగంగా మసకబారుతోందన్న అంచనాతో ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలు సహా కేడర్ తెలుగుదేశం వైపు చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాయల సీమ జిల్లాల నుంచి బలమైన నేతలు, కేడర్ కూడా చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్షఅని భావిస్తున్నారు. ఆ విషయమే బాహాటంగా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వీరశివారె్డి, వరద రాజులు రెడ్డి, డీఎల్ రవీంద్రా రెడ్డి వంటి వారు తెలుగుదేశం గూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఇటీవలి వారి మీడియా సమావేశాలు, ప్రకటనలను బట్టి అవగత మౌతున్నదని అంటున్నారు. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి జగన్ పాలన చూసి తుగ్లక్ కూడా నవ్వుకుంటాడని విమర్శించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా  బుధవారం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో బేటీ అయ్యారు. భేటీ అనంతరం వీలేకరులతో మాట్లాడిన ఆయన తాను త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇంత కాలం వైసీపీకి అనుకూలంగా ఉన్న ఆయన ఇప్పడు జగన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబుతో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

నారా లోకేష్ తో బేటీలో రాష్ట్రంలో పరిస్థితులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించినట్లు చెప్పారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కూడా తెలుగుదేశం పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రకటించి తాను ఆ పార్టీలో చేరనున్నట్లు పేర్కొన్నారు.

ఇక మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి కూడా చంద్రబాబు విధానాలే రాష్ట్రప్రగతికి సోపానాలని పేర్కొన్నారు. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తతం వైసీపీలో ఉన్న ఆయన త్వరలో తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే జగన్ విధానాలను తీవ్రస్థాయిలో ఎండగడుతున్న రవీంద్రారెడ్డి తెలుగుదేశం గూటికి చేరుతారని ఆయన వర్గీయులు కూడా చెబుతున్నారు.

రాయలసీమలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జల్లాలలోనూ వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తే అవకాశాలున్నాయనీ, ఉత్తరాంధ్రలో వాసుపల్లి గణేష్, గోదావరి జిల్లాలలోనూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యక్తమౌతున్న ప్రజాగ్రహాన్ని చూసి ఆ పార్టీ నేతలు తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళనలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.