వైఎస్ వివేకా మృతి.. ఏడు కత్తి గాయాలు.. ఎన్నో అనుమానాలు

 

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అధినేత వైస్ జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి సంచలనం రేపుతోంది. ఆయన మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. మొదట ఆయన తెల్లవారు జామున బాత్ రూమ్ కి వెళ్లి గుండె పోటుతో అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారని వార్తలొచ్చాయి. కాసేపటికి ఆయన మృతదేహం రక్తం మడుగులో పడి ఉందని.. ఆయన తలకి, చేతులకి గాయాలు ఉన్నాయని.. ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ పోలీసులు కూడా వివేకాది హత్యే అని ప్రాధమికంగా నిర్దారించారు. వివేకానంద రెడ్డిది సహజ మరణం కాదని, ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా నిర్థారణ అయిందని పోలీసులు వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నట్లు, పదునైన ఆయుధంతో వివేకా తల, శరీరంపై దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు.

పోస్టుమార్టం నివేదికను బట్టి చూస్తే వివేకా హత్యకు గురయ్యారని అర్ధమవుతోంది. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన రక్తపు మడుగులో పడి ఉంటే.. ఆయనది సహజం మరణమని, ఆయన గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారు?. అసలు తొలుత అలా ఎవరు ప్రచారం చేశారు? అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?. వివేకా సౌమ్యుడని, వివాదాలకు దూరంగా ఉంటారని పేరుంది. మరి అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికుంది?. ఆయన హత్య వెనుక రాజకీయ కోణాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతకి స్వయానా బాబాయ్ అయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. ఆయన మృతి రాజకీయ కోణం సంతరించుకుంది. ఇప్పటికే వివేకా మృతిపై కొందరు వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిమీద ఒకరు అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు వివేకా మృతిపై విచారణకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ నివేదిక వస్తే కానీ వివేకా మృతి వెనుక రాజకీయ కుట్ర ఉందో, మరేదైనా కక్ష ఉందో తెలీదు.