కర్నూలులో కాల్పులు... టీడీపీ అభ్యర్థికి గాయాలు...


ఎన్నికల వేళ ఏపీలో ఫ్యాక్షన్ గొడవలు తారాస్థాయికి వెళ్తున్నాయి. వైసిపి అధినేత జగన్ బాబాయ్, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైయస్ వివేకానంద రెడ్డిని గుర్తు తెలియని కొంతమంది దుండలు హత్యచేసిన సంగతిని మర్చిపోకమునుపే కర్నూల్ జిల్లాలోని వైసిపి నాయకుడు ఎమ్మెల్యే బాలానాగిరెడ్డి స్వగ్రామం ఖగ్గల్‌లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి టీడీపీ జెండాను ఆవిష్కరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తిక్కారెడ్డి ప్రచారాన్ని ఎమ్మెల్యే బాలానాగిరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు, మరియు టీడీపీ జెండాను తొలగించటమే కాకుండా టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడిచేసినట్లు తెలుస్తోంది.

 

 

ఈ క్రమంలోనే తిక్కారెడ్డి గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా గ్రామ ప్రజలు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. వారు వచ్చేసరికే పరిస్థితి చేజారి పోవడంతో పోలీసుకు కూడా గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో తిక్కారెడ్డితో పాటు మాధవరం ఏఎస్ఐకు గాయాలయ్యాయి. వారిని ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.