లాయర్ల ఫీజుకి కూడా డబ్బుల్లేని స్థితిలో మన్మోహన్ సింగ్

 

పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి దగ్గర డబ్బులు లేవంటే నమ్ముతారా?. ఒక్కసారి ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన వారే కోట్లు వెనకేసుకుంటున్నారు. అలాంటిది ప్రధానిగా పనిచేసిన వారు ఇంకెంత వెనకేసుకోవాలి అంటారా?. అందరు నాయకులు అలా ఉండరు. కొందరు నిజాయితీగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేసారు. గొప్ప ఆర్థికవేత్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ స్నేహితుల వద్ద వాపోతున్నారట.

మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఈమధ్య రిలీజ్ చేశారు. ఇందులోని కొన్ని సన్నివేశాలు మన్మోహన్‌ను కించపరిచేలా ఉన్నాయి. వీటిపై వివాదం చెలరేగింది. అయితే సినిమా నిర్మాతలపై పరువు నష్టం దావా వేయాలని కొందరు కాంగ్రెస్‌ నేతలు తనకు సలహా ఇచ్చారని మన్మోహన్‌ సింగ్‌ తాజాగా తనను కలిసిన పాత స్నేహితుడు, ఏపీ మాజీ ఎంపీ యలమంచిలి శివాజీతో అన్నట్లు తెలుస్తోంది. ‘నిజమే.. నన్ను పరువునష్టం దావా వెయ్యమన్నారు. కానీ వారిపై దావా వేసి కోర్టులో పోరాడేందుకు నా దగ్గర డబ్బులెక్కడివీ?. లాయర్లకు భారీగా ఫీజులు చెల్లించాలి కదా’ అని ఆయన అన్నట్లు సమాచారం. దేశానికి ప్రధానిగా వ్యవహరించి.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడటం విస్మయం కలిగిస్తుంది.