అధ్య‌క్షా.. నాకు సెల‌వు కావాలి!

పార్ల‌మెంటు మొద‌లై ప‌ట్టుమ‌ని మూడు రోజులు కూడా కాలేదు. ఆదిలోనే హంస‌పాదు ఎదుర‌వుతున్న‌ది. ఎంపీల్లో చాలామంది పార్ల‌మెంటుకి హాజ‌ర‌య్యేందుకు బొత్తిగా ఇష్ట‌ప‌డ‌టం లేదు. క‌రోనా వైర‌స్ ఏమాత్రం జాలి లేకుండా త‌న మానాన తాను దూకుడుగా ఎగిరి గంతేస్తున్న ఈ త‌రుణంలో ఎవ‌రికి వారు మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ పార్ల‌మెంటుకి వ‌స్తున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. బుధ‌వారం మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబ‌రంతో స‌హా డ‌జ‌నుకు పైగా ఎంపీలు సెల‌వు చీటీలు స‌మ‌ర్పించారు. వ‌యోభారం వ‌ల్ల స‌మావేశాల‌కు రాలేక‌పోతున్నారా అంటే అదేమీ కాదు. క‌రోనా కార‌ణంగా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌తోనే వారీ నిర్ణ‌యానికొచ్చారు. మ‌న్మోహ‌న్ సింగ్ వ‌య‌స్సు 87 ఏళ్లు. అందువ‌ల్ల ఆయ‌న అవ‌స్ధ‌ని అర్ధం చేసుకోవ‌చ్చు. ఎక్కువ వ‌య‌స్సున్న వాళ్ల‌ని క‌రోనా అతి సునాయాసంగా ఆక‌ర్షిస్తున్న‌ద‌న్న వైద్యుల అప్ర‌మ‌త్త‌త నేప‌థ్యంలో మ‌న్మోహ‌న్ సింగ్ సెల‌వు పెట్ట‌డాన్ని పెద్ద‌గా అభ్యంత‌ర‌పెట్ట‌లేము. ఇక చిదంబ‌రం. ఆయ‌నకు 75 ఏళ్లు. కాబ‌ట్టి చిదంబ‌రానికీ మిన‌హాయింపు ఇవ్వొచ్చు. ఇలాంటి పెద్ద‌లు ఈ స‌మావేశాల చివ‌రి దాకా సెల‌వు అడిగారు. వీళ్లే కాదు. వైకాపా త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన పిర‌మ‌ల్ న‌త్వానీ కూడా సెల‌వు పెట్టారు. ఇలా మొత్తంమీద ప‌ద‌మూడు మంది దాకా సెల‌వు బాట‌లో ఉన్నారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు వీరంద‌రికీ సెల‌వు మంజూరు చేశారు. మ‌రి రేప‌ట్నుంచి ఇంకా ఎంత‌మంది ఇదే బాట‌లో ప‌య‌నిస్తారో తెలీదు. 

 

ఇటు రాజ్య‌స‌భ‌, అటు లోక్‌స‌భ ఇలా సెల‌వుల ప‌ర్వంలో ఉంటే స‌మావేశాలు స‌జావుగా సాగుతాయా అన్న సందేహాలున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఉభ‌య స‌భ‌లు అటు సంఖ్యాప‌రంగానే కుదించుకున్నాయి. పూర్తి స్ధాయిలో స‌భ్యులు హాజ‌రు కావ‌డం లేదు. అలాగే ప్ర‌శ్నోత్త‌రాలు ఎత్తేశారు. ఇలా కీల‌క‌మైన స‌భా కార్య‌క్ర‌మాల‌నే కుదించాల్సి వ‌చ్చింది. మ‌రి రాజ్యాంగ నియ‌మాల ప్ర‌కారం పార్ల‌మెంటు జ‌ర‌పాలి. పెండింగ్ బిల్లులు ఉంటాయి. వాటిని ఆమోదించి చ‌ట్ట‌రూపం తేవాలి. అవి నిజానికి చాలా ముఖ్యమైన‌విగా ఉంటాయి. కాని అవ‌త‌ల క‌రోనా ప‌రిస్థితి అలా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వం కూడా మ‌మ అనే ప‌ద్ద‌తిలోనే స‌భ‌ను సాగిస్తున్న‌ది. అందువ‌ల్ల ఎంత‌మంది స‌భ్యులు సెల‌వులు పెట్టినా స‌భ‌లో పూర్తి చేయాల్సిన ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు పూర్తి చేయ‌డానికి పెద్ద‌గా అడ్డంకులు ఏవీ ఉండ‌క‌పోవ‌చ్చు. ఎటొచ్చీ స‌మావేశాల చివ‌రిదాకా ఎంత‌మంది స‌భ‌లో నిలుస్తార‌న్న‌దే ప్ర‌శ్న‌. తామెవ్వ‌రం లేకుండా బిల్లులు ఆమోదించ‌డానికి వీల్లేద‌ని ఎంత‌మంది అడ‌గ‌గ‌ల‌రు? అడిగితే ప్ర‌భుత్వం మిన్న‌కుంటుందా? అవ్వా కావాలి..బువ్వా కావాలి అంటే కుద‌ర‌దు..అవ‌త‌ల క‌రోనాకి లీవూ మీరే అడుగుతారు..మ‌ళ్లీ బిల్లుల మీద చ‌ర్చ‌లో మీరే ఉండాల‌ని అడుగుతారా అంటూ ఎదురుదాడి చెయ్య‌దా?

-రాజా రామ్మోహ‌న్ రాయ్‌