TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రభుత్వం చర్య తీసుకోకుంటే మేమే తీసుకుంటాం: సుప్రీంకోర్టు 

Published on: Thu Jul 20, 2023 3:33PM

మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా, ఈ ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటాగా స్వీకరించింది. ఇది తమను తీవ్రంగా కలిచివేసిందని, ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. తామే తీసుకుంటామని హెచ్చరించింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరంగా జులై 28లోగా నివేదిక అందజేయాలని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది.

 ‘నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలపై చాలా బాధపడ్డాం..తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం.. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది... ఇది ఆమోదయోగ్యం కాదు.. ప్రభుత్వం చర్య తీసుకోకపోతే, మేం తీసుకుంటాం.. అటువంటి హింసకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు తప్పక తెలియజేయాలని మేము భావిస్తున్నాం.. మీడియాలో చిత్రీకరించిన, కనిపించిన విజువల్స్ స్థూలంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘన కిందకే వస్తాయి’ అని సీజేఐ చంద్రచూడ్ ఘాటుగా హెచ్చరించారు.