మణిపూర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం
Published on: Mon Mar 14, 2016 2:52PM
.jpg)
కొద్ది రోజుల క్రితమే అరుణాచల్ ప్రదేశ్‌లో హాయిగా సాగిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాస్తా కుప్పకూలిపోయింది. అక్కడ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 60 సీట్లకుగాను 42 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్. కానీ అందులో 30 మంది సభ్యులు తిరుగుబాట పట్టడంతో పరిస్థితి రాష్ట్రపతి పాలన దాకా వచ్చింది. ప్రస్తుతం ఆ 30 మంది మద్దతుతో స్థానిక ‘పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్’ ముఖ్యమంత్రి పీఠాన్ని తన్నుకుపోయింది. ప్రస్తుతం మణిపూర్ పరిస్థితీ ఇలాగే ఉంది. అక్కడ 47మంది కాంగ్రెస్ సభ్యులలో ప్రస్తుతం ఓ 25మంది బీజేపీలోకి దూకేందుకు సిద్ధంగా ఉండటంతో, ప్రభుత్వం సంక్షోభంలోకి కూరుకుపోయింది.
ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మీద తమ నిరసనలను పార్టీ అధినాయకత్వం పట్టించుకోకపోవడంతో, వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో జరిగిన పొరపాటుని ఈసారి కాంగ్రెస్ అధినాయకత్వం చేయబోవడం లేదు. అప్పట్లో అసమ్మతి సభ్యులను సోనియా, రాహుల్ ఇద్దరూ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి సోనియా వారి డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి సోనియా హామీలు అసమ్మతిని శాంతింపచేస్తాయో లేదో చూడాలి!


