దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలకపాత్ర : మంత్రి నారా లోకేష్
Published on: Fri Jul 17, 2026 7:57PM
.webp)
ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని..
దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలకపాత్ర అని, రైల్వే స్టేషన్ల ద్వారా ఆర్థికాభివృద్ధి జరగాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' కింద ₹12.56 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... దేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. కేవలం ఒకే సంస్థ మొత్తం భారతదేశాన్ని కలుపుతోంది. అదే మన రైల్వే సంస్థ. మన జీవిత ప్రయాణంలో ఎప్పుడో ఒకప్పుడు రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై వేచి చూసి ఉంటారు, రైలు కిటికీలోంచి బయటకు చూసి ఉంటారు లేదా భారతీయ రైల్వేలో ఒక ముఖ్యమైన ప్రయాణం చేసి ఉంటారు. అందుకే భారతీయ రైల్వే కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు, అది భారతదేశ జాతీయ సమైక్యత, సమగ్రతకు ఒకగొప్ప సాధనం. దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలకపాత్ర. అందుకే ప్రధాని రైల్వే వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేలు అభివృద్ధి చెందాలి
గతంలో దశాబ్దాల తరబడి భారతీయ రైల్వేలు రద్దీగా ఉండే స్టేషన్లు, ఆలస్యమయ్యే రైళ్లు, పాతబడిన మౌలిక సదుపాయాలకు మారుపేరుగా ఉండేవి. నేడు, ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు... వందే భారత్, బుల్లెట్ రైళ్లు, 'కవచ్' భద్రతా సాంకేతికత, 100% విద్యుదీకరణ, ఆధునిక సరుకు రవాణా కారిడార్లు, ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు, హైడ్రోజన్ ఆధారిత రైళ్ల గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఇది సాధారణ ఆధునీకరణ మాత్రమే కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలో జరుగుతున్న అతిపెద్ద మార్పు ఇది.
ఇది ఒక రైల్వే విప్లవం. దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేలు అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోదీ ఆలోచన. నరేంద్ర మోదీ నాయకత్వంలో, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ దార్శనికతతో, భారతీయ రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. వేలాది కిలోమీటర్ల నూతన రైల్వే లైన్లను నిర్మిస్తున్నారు.
ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ భారతదేశానికి హై-స్పీడ్ రైలును తీసుకువస్తూ, ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని నిరూపిస్తోంది. పర్యావరణహిత రవాణా రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని హైడ్రోజన్ రైలు నిరూపిస్తోంది. మన మంగళగిరి రైల్వేస్టేషన్ లో ఎక్కువ రైళ్లు ఆగేలా చూడాలని ఈ సందర్భంగా పెద్దలను కోరుతున్నా.
దక్షిణ భారతదేశంలో నెం.1 రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం
రైల్వే స్టేషన్ల ద్వారా ఆర్థికాభివృద్ధి జరగాలి. ఈ రోజు పెద్దఎత్తున మనం ప్రజారాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకుంటున్నాం. అమరావతిలో కేవలం భవనాలు నిర్మించడమే కాదు.. ఎయిర్, రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి ఈ మూడింటినీ అనుసంధానం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ నెట్ వర్క్ ఏర్పాటుచేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి నిలిచిపోయింది. అమరావతి పనులు నిలిపివేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి పెద్దఎత్తున అమరావతి పనులు పరిగెత్తిస్తున్నారు. అమరావతిని గ్లోబల్ సిటీగా తయారుచేయాలనేది మనందరి లక్ష్యం. 60 ఏళ్లు చెమటోడ్చి హైదరాబాద్ ను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకున్నాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడపట్టి బయటకు గెంటేశారు. ఈ రోజు హైదరాబాద్ ను చూసి అసూయ పడుతున్నా. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఏపీని కూడా దక్షిణ భారతదేశంలో నెం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.
కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం
డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్రంలో నరేంద్ర మోదీ , రాష్ట్రంలో సీఎం చంద్రబాబు .. ఇద్దరూ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా 'సౌత్ కోస్ట్ రైల్వే జోన్'ను ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను మోదీ గారు నెరవేర్చారు. కేంద్ర సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం.
పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకువచ్చాం. ఈ రోజు ఏకంగా మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. మంగళగిరిలో రెండేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. శ్మశానాల దగ్గర నుంచి కమ్యూనిటీ భవనాలు, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి, రైల్వే స్టేషన్ ఆధునీకరణ వంటి ఎన్నో పనులను ప్రజాప్రభుత్వం చేపట్టింది.
నా గౌరవాన్ని నిలబెట్టారు
2019 లో మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థంకాలేదు. ఫలితంగా 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఐదేళ్లు కష్టపడ్డా. మీ మనస్సులు గెలుచుకున్నా. ఎవరూ ఊహించని విధంగా మంగళగిరిలో 91వేల మెజార్టీతో విజయం సాధించా. మీరే నా కొండంత బలం. ఈ రోజు నేను ఏ మంత్రి తో మాట్లాడినా మంగళగిరి అభివృద్ధికి సహకరిస్తున్నారు. నా గౌరవాన్ని మీరు నిలబెట్టారు. నాపై బాధ్యత పెరిగింది. గడిచిన రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.
ఇది తొలి అడుగు మాత్రమే. భవిష్యత్ లో అనేక కార్యక్రమాలు చేపడతాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి ఏపీని అభివృద్ధి పథంలో పరిగెత్తిస్తున్నారు. ఈ రోజు అనేక పరిశ్రమలు ఏపీకి తరలివస్తున్నాయి. రాయల్ ఎన్ ఫీల్డ్, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, ఏఎంసీఏ ప్రాజెక్ట్ ఏపీని వెతుక్కుంటూ వచ్చాయి. ఇంకో మూడేళ్లలో నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలవైపు చూడాల్సిన పనిలేదు. పొరుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఏపీ వైపు చూసే విధంగా పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకువస్తున్నాం.
మంగళగిరికి పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం
మంగళగిరి అభివృద్ధికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంతో సహకరిస్తున్నారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే కలిసి పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో మంగళగిరి నిదర్శనం. మంగళగిరికి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే దిశగా పనిచేస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్, పాల్గొన్నారు.
Mangalagiri Railway Station, Amrit Bharat Station Scheme, PM MODI, Minister Pemmasani Chandrasekhar, Railway Minister Ashwini Vaishnav, Vande Bharat, bullet trains, CM Chandrababu


