పొట్టపగిలి పేగులు బయటకొచ్చినా....పదకొండు కిలోమీటర్లు నడిచి బతికాడు !

 

వేగంగా కదులుతున్న ఒక రైల్లో నుండి కింద పడిన ఒక వ్యక్తి కడుపులో నుండి పేగులు బయటకి రాగా, వాటిని లోపలి నెట్టి  11 కిలోమీటర్లు నడిచి మరీ ఆ వ్యక్తి ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు. వింటుంటేనే జుగుత్స కలిగిస్తున్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని హుసేనాబాద్‌కు చెందిన సునీల్ చౌహాన్ (38) కూలి పనుల కోసం సోదరుడు ప్రవీణ్ చౌహాన్‌తో కలిసి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నాడు. అర్ధరాత్రి దాటి రెండు గంటల సమయంలో రైలు వరంగల్‌ అర్బన్ జిల్లా పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ దాటుతోంది. సునీల్ బాత్రూం కోసం వచ్చి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు.

రైలు వేగంగా వెళ్తుండడంతో కింద ఉన్న సూదిమొనల్లాంటి రాళ్లు తగిలి పొట్ట కోసుకుపోయింది. దీంతో చిన్న పేగులు బయట కొచ్చేశాయి. బాగా రక్తం పోయింది, పడిన వెంటనే షాక్ లోకి వెళ్ళిన అతను తేరుకున్నాక చూస్తే గాడాంధకారం అలుముకుని ఉంది, ఎవరైనా సాయం చేస్తారేమో అని చూస్తే  ఎవరూ కనిపించలేదు. ఇలాగే వెలుతురు వచ్చేదాకా ఉన్నా, ఎవరైనా వచ్చి కాపాడతారు అని నమ్మకం లేదు, ఎందుకనే అతను పడిన చోట ఒక్కటంటే ఒక్క లైట్ కూడా లేకపోవడమే, దీంతో పేగులను బలవంతంగా లోపలికి నెట్టి తన చొక్కా విప్పి ఆ పేగులు బయటకు రాకుండా గట్టిగా కట్టాడు. 

ఆ చీకట్లోనే భగవంతుడి మీద భారం వేసి నడవడం మొదలుపెట్టాడు, రైలు పట్టాలనే ఆధారంగా చేసుకుని నడిచీ నడిచీ పదకొండు కిలోమీటర్లు వెళ్ళాక ఏదో స్టేషన్ కనిపించింది. అక్కడికి వెళ్లి స్టేషన్ మాస్టర్ ని వెతుక్కుని వెళ్లి ఆయన ముందు కుప్పకూలు పోయాడు, దీంతో వెంటనే ఆ స్టేషన్ మాస్టర్ ఆసుపత్రికి చేర్చగా చివరికి చేరి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే ఈ ఘటన తెలంగాణలోనే జరగడం గమనార్హం.